Share News

విద్యార్థులు, జర్నలిస్టుల వీసా కాలపరిమితిపై ట్రంప్‌ సర్కారుకు చుక్కెదురు..

ABN , Publish Date - Nov 17 , 2026 | 08:08 AM

అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు, వృత్తిరీత్యా పనిచేస్తున్న విదేశీ జర్నలిస్టులకు అక్కడి ఫెడరల్‌ కోర్టు భారీ ఊరటనిచ్చింది. వారి వీసా కాలపరిమితిని కుదిస్తూ ట్రంప్‌ యంత్రాంగం తీసుకొచ్చిన కఠిన నిబంధనలను కొట్టేసింది.

విద్యార్థులు, జర్నలిస్టుల వీసా కాలపరిమితిపై ట్రంప్‌ సర్కారుకు చుక్కెదురు..
US Student Visa

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు, వృత్తిరీత్యా పనిచేస్తున్న విదేశీ జర్నలిస్టులకు అక్కడి ఫెడరల్‌ కోర్టు భారీ ఊరటనిచ్చింది. వారి వీసా కాలపరిమితిని కుదిస్తూ ట్రంప్‌ యంత్రాంగం తీసుకొచ్చిన కఠిన నిబంధనలను కొట్టేసింది. సోమవారం బోస్టన్‌లోని మసాచుసెట్స్‌ ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు న్యాయమూర్తి ఎఫ్‌. డెన్నిస్‌ సేలర్‌ తీర్పు వెలువరించారు. హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్‌) రూపొందించిన ఈ నూతన విధానం ఏకపక్షంగా, అహేతుకంగా, చట్టవిరుద్ధంగా ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు.


ఏమిటీ వివాదం?

ఇప్పటివరకు ఉన్న 'డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌' నిబంధన ప్రకారం.. విదేశీ విద్యార్థులు (ఎఫ్‌-1, జే-1 వీసాదారులు) తమ కోర్సు పూర్తయ్యేంతవరకు అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంది. అయితే, ట్రంప్‌ ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలుకుతూ విద్యార్థుల వీసా గరిష్ఠంగా నాలుగేళ్లకు పరిమితం చేసింది. ఆ తర్వాత పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన పెట్టింది. అలాగే విదేశీ జర్నలిస్టుల ఐ-వీసా గడువును ఐదేళ్ల నుంచి కేవలం 240 రోజులకు (సుమారు 8 నెలలు), చైనా జర్నలిస్టులకు 90 రోజులకు కుదించింది. దీనిని సవాలు చేస్తూ విశ్వవిద్యాలయాల సంఘాలు, అధ్యాపకులు, కార్మిక, జర్నలిస్టు సంఘాల కూటమి ఆగస్టులో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సెప్టెంబరులో ఈ నిబంధనల అమలుపై తాత్కాలిక స్టే విధించిన న్యాయమూర్తి, తాజాగా వాటిని పూర్తిగా కొట్టివేశారు.


కాంగ్రెస్‌ ఉద్దేశానికి విరుద్ధం..

ఈ సందర్భంగా న్యాయమూర్తి డెన్నిస్‌ సేలర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘విదేశీ విద్యార్థులకు అమెరికాలో విద్యావకాశాలు కల్పించాలని అమెరికా కాంగ్రెస్‌ భావిస్తుంటే, డీహెచ్‌ఎస్‌ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వారిని నిరుత్సాహపరుస్తోంది’ అని సేలర్‌ స్పష్టం చేశారు. ఈ నిబంధనల వల్ల పీహెచ్‌డీ వంటి సుదీర్ఘ పరిశోధన కోర్సులు చేయడం, జాయింట్‌ డిగ్రీలు పొందడం, కోర్సు మధ్యలో సబ్జెక్టులు మార్చుకోవడం విద్యార్థులకు అసాధ్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోసాలను అరికట్టేందుకు 'సెవిస్‌' (SEVIS) వంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలను బలోపేతం చేయకుండా, నేరుగా వీసా గడువును కుదించడం సరికాదన్నారు. 2023-24 విద్యాసంవత్సరంలో అమెరికాలో రికార్డు స్థాయిలో 11 లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో భారతీయ విద్యార్థుల సంఖ్యే అత్యధికంగా ఉండటంతో, తాజా తీర్పు భారతీయ విద్యార్థులకు ఎంతో మేలు చేయనుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

మహిళా కాంగ్రెస్‌.. రెండో జాబితా విడుదల

గంజాయి అక్రమ రవాణా నిందితుడిపై పీడీ యాక్ట్‌

Updated Date - Nov 17 , 2026 | 08:56 AM