Share News

ఇరాన్, ఇజ్రాయెల్ తక్షణమే ఘర్షణను తగ్గించుకోవాలి: యూకే విదేశాంగ కార్యదర్శి వైవెట్ కూపర్

ABN , Publish Date - Jun 08 , 2026 | 07:55 AM

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ బ్రిటన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగిన నేపథ్యంలో... ఇరు దేశాలు తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ పిలుపునిచ్చారు.

ఇరాన్, ఇజ్రాయెల్ తక్షణమే ఘర్షణను తగ్గించుకోవాలి: యూకే విదేశాంగ కార్యదర్శి వైవెట్ కూపర్
UK Foreign Secretary Yvette Cooper Urges Iran and Israel to De-Escalate Conflict

లండన్, జూన్ 8: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ బ్రిటన్ (UK) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగిన నేపథ్యంలో... ఇరు దేశాలు తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఘర్షణలు ప్రారంభం కావడం ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు.

'ఇరు పక్షాలూ అత్యంత సంయమనం పాటించాలి. ఉద్రిక్తతలను వెంటనే అదుపులోకి తెచ్చుకోవాలి. ప్రాంతీయ శాంతి, స్థిరత్వంతో పాటు ప్రపంచ వాణిజ్యం మళ్లీ యథాస్థితికి రావాలంటే.. అందరికీ అవసరమైన శాశ్వత పరిష్కారం వైపు చర్చలు కొనసాగడం ఒక్కటే మార్గం'. అని వైవెట్ కూపర్ పేర్కొన్నారు.


ఏప్రిల్ 8న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడికి దిగడం ఇదే మొదటిసారి. ఉత్తర ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ఈ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇరాన్ వైపు నుంచి మిస్సైళ్లు దూసుకురావడంతో ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగాయి.

ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ధృవీకరించింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు రంగంలోకి దిగి ఆ క్షిపణులను గాల్లోనే అడ్డుకున్నట్లు వెల్లడించింది. అయితే, ఈ తాజా దాడి వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని 'యూరో న్యూస్' నివేదించింది.


హెజ్‌‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి:

అంతకుముందు, లెబనాన్ సరిహద్దుల నుంచి హెజ్‌‌బొల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంపైకి జరిపిన దాడులకు ప్రతిచర్యగా బీరూట్‌లోని దహియా జిల్లాలో ఉన్న ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ ఉద్రిక్తతల కొనసాగింపుగానే ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్‌పై నేరుగా క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఈ పరిణామాలపై బ్రిటన్, అమెరికా వంటి అగ్రదేశాలు ఇరుపక్షాలను శాంతించాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలపై దృష్టి పెట్టాము: ఎల్ఐసీ సీఈఓ

ఆచితూచి అడుగేయండి.. ఇన్వెస్టర్లకు నిపుణులు సూచన

Updated Date - Jun 08 , 2026 | 08:09 AM