చైనాను వణికిస్తున్న టైఫూన్ ‘బావి’.. తెగిపడిన లైట్‌హౌస్ హైటెన్షన్ విద్యుత్ లైన్
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:39 PM
చైనాలో టైఫూన్ బావి బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను ప్రభావంతో లియావోనింగ్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. దీంతో 2,60,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: చైనాలో టైఫూన్ బావి బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను ప్రభావంతో లియావోనింగ్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. దీంతో 2,60,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించినట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. టైఫూన్ బావి భారీ స్థాయిలో ఉష్ణ మండల తేమను ఉత్తర చైనా వైపు తీసుకురావడంతో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.
లియావోనింగ్ రాజధాని షెన్యాంగ్‌లో వరద ఉద్ధృతికి ఓ లైట్‌హౌస్‌కు చెందిన హైటెన్షన్ విద్యుత్ లైన్ తెగిపోయింది. అది వరద నీటిలో కొట్టుకుపోతూ ప్రధాన రహదారులపై, వంతెన కిందుగా తేలుతూ వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తుఫాన్ తీవ్రత దృష్ట్యా అన్ని పాఠశాలలు, శిక్షణ సంస్థలకు సెలవులు ప్రకటించారు. షెన్యాంగ్, జిలిన్ సహా పలు ఈశాన్య నగరాల్లో రవాణా సేవలు కూడా నిలిచిపోయాయి.
13 రోజుల క్రితం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ టైఫూన్.. ఫ్రాన్స్ దేశమంత విస్తీర్ణాన్ని కలిగి ఉంది. శనివారం రాత్రి తూర్పు చైనాలో తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా కొనసాగుతోందని వాతావరణ నిపుణులు తెలిపారు. దీంతో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ ఏడాది అత్యంత ఎక్కువ కాలం కొనసాగిన ఉష్ణ మండల తుఫాన్‌గా టైఫూన్ నిలిచింది. చైనా వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం, తుఫాన్‌లోని ‘వార్మ్ కోర్’ (వెచ్చని కేంద్ర భాగం) బలంగా ఉండటంతో టైఫూన్ భారీ తేమను నిల్వ చేసుకుంటూ ఉత్తర దిశగా, కొరియా ద్వీపకల్పం వైపు కదులుతోంది. తుఫాన్ వేగం తగ్గే కొద్దీ అందులోని తేమ ఒక్కసారిగా విడుదలై మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల.. చెన్నైలో తొలి మ్యాచ్..
వన్డే ప్రపంచ కప్ 2027.. రో-కో అనుభవం జట్టుకు అవసరం: గిల్