Share News

హౌతీలపై పోరులో ఇజ్రాయెల్ సాయం తీసుకోవాలి.. సౌదీకి ట్రంప్ సూచన

ABN , Publish Date - Oct 17 , 2026 | 02:47 PM

హౌతీల దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ అందిస్తున్న సహాయాన్ని సౌదీ అరేబియా తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు.

హౌతీలపై పోరులో ఇజ్రాయెల్ సాయం తీసుకోవాలి.. సౌదీకి ట్రంప్ సూచన
Trump on Saudi Israel Cooperation

Trump on Saudi Israel Cooperation: పశ్చిమాసియా ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, హౌతీ రెబెల్స్ దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ అందిస్తున్న ఆఫర్‌ను సౌదీ అరేబియా అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్ డీసీ నుంచి జార్జియాలో జరిగే ర్యాలీకి బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సౌదీ అరేబియా.. ఇజ్రాయెల్ సహాయాన్ని తీసుకోవాలా.. వద్దా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. 'అవును, నేను కచ్చితంగా అలానే అనుకుంటున్నాను. సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్ ఎంతో సహాయకారిగా ఉంది' అని పేర్కొన్నారు.


ఇజ్రాయెల్, పలు అరబ్ దేశాల మధ్య సంబంధాలను సాధారణీకరించే అబ్రహం ఒప్పందాల్లోకి సౌదీ అరేబియా కూడా చేరే అవకాశం గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది తమ గొప్ప విజయాలలో ఒకటిగా ఆయన అభివర్ణించారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో తమ సహాయం కోరని దేశాలు దాదాపు లేవని పేర్కొన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 7, 2023 నాటి హమాస్ దాడికి ముందు ఇజ్రాయెల్-సౌదీ సంబంధాలు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ, పాలస్తీనా దేశ ఏర్పాటుకు స్పష్టమైన మార్గం ఉంటేనే సాధ్యమని సౌదీ స్పష్టం చేస్తూ వస్తోంది.


యెమెన్ పరిణామాలు, ఇరాన్ వైఖరి

యెమెన్‌లోని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వంపై హౌతీలు దాడులను ఉధృతం చేస్తున్నారు. కైరో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న యెమెనియా ఎయిర్‌లైన్స్ విమానం సమీపంలో హౌతీలు రెండు క్షిపణులతో అడెన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్నారని సమాచార మంత్రి మోమర్ అల్-ఎర్యాని తెలిపారు.

కాగా, హౌతీల దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయీ స్పష్టం చేశారు. యెమెన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని, ఎయిర్, సముద్ర దిగ్బంధనాన్ని ఆపాలని ఆయన కోరారు.

గత 24 గంటల్లో సౌదీ యుద్ధ విమానాలు యెమెన్‌లోని వివిధ ప్రాంతాలపై 101 సార్లు వైమానిక దాడులు జరిపినట్లు హౌతీ ప్రతినిధి యహ్యా సరీ ఆరోపించారు. మరోవైపు, యన్బు వైపు దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని, ఎర్రసముద్రంపై రెండు క్రూయిజ్ క్షిపణులను, మూడు డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాల ప్రతినిధి తుర్కీ అల్-మాలికి వెల్లడించారు.


ఈ వార్తలూ చదవండి

రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్‌ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.

‘ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేయకపోతే ధ‌ర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక

Updated Date - Oct 17 , 2026 | 02:58 PM