మళ్లీ యుద్ధం ప్రకటించడానికి అదే మంచి కారణమవుతుంది: ట్రంప్
ABN , Publish Date - Jun 05 , 2026 | 07:57 AM
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ గనుక అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడితే, ఆ దేశంపై మళ్లీ పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించడానికి అది మంచి కారణంగా మారుతుందని హెచ్చరించారు.
వాషింగ్టన్, మే 5: అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ గనుక అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడితే, ఆ దేశంపై మళ్లీ పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించడానికి అది బలమైన కారణంగా మారుతుందని హెచ్చరించారు. గురువారం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని అమెరికా ఇప్పటికే పూర్తిగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. 'ఒకవేళ వాళ్లు మా సైనికులను చంపితే, యుద్ధాన్ని తిరిగి ప్రారంభించడానికి అది సరైన కారణం అవుతుంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద నౌకాదళం కానీ, వాయుసేన కానీ లేవు. వారి నాయకత్వాన్ని మేము పూర్తిగా తుడిచిపెట్టేశాం. ఇరాన్ వద్ద ఉన్న 159 నౌకలు ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉన్నాయి, వాటికి సంబంధించిన ఫొటోలు కూడా మా వద్ద ఉన్నాయి. అయినా సరే, ఇరాన్ యుద్ధంలో బాగా రాణిస్తోందంటూ ఫేక్ న్యూస్ మీడియా కథనాలు రాయడం నమ్మశక్యం కావడం లేదు' అని ట్రంప్ మండిపడ్డారు.
మరోవైపు, ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా సైనిక చర్యలు తీసుకోకుండా నిలువరించేందుకు అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) బుధవారం ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. ట్రంప్ యుద్ధ అధికారాలను పరిమితం చేసేలా డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయి. విశేషం ఏంటంటే, ట్రంప్‌నకు చెందిన రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు కూడా డెమొక్రాట్లతో చేతులు కలిపి ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.
గత ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడిగా సైనిక దాడులు ప్రారంభించిన తర్వాత.. ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేసేలా కాంగ్రెస్ తీసుకున్న మొదటి విజయవంతమైన చర్యగా ఇది నిలిచింది. ప్రస్తుతం ఈ తీర్మానం సెనేట్ ఆమోదం కోసం పంపించారు. తన అధికారాలను పరిమితం చేస్తూ ప్రతినిధుల సభ తీసుకున్న నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఓటింగ్‌ను ఒక అర్ధరహితమైన ప్రక్రియగా ఆయన కొట్టిపారేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News