హోర్ముజ్ మూతపడడంతో ఇరాన్‌కు ఆర్థిక ఇబ్బందులు : డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Sep 27 , 2026 | 09:43 AM
హోర్ముజ్ జలమార్గం మూతపడడంతో ఇరాన్ తీవ్రంగా ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దీంతో హోర్ముజ్‌ను మళ్లీ తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు. ట్రంప్ వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడారు.
ఇంటర్‌నెట్ డెస్క్: హోర్ముజ్ జలమార్గం మూతపడడంతో ఇరాన్ తీవ్రంగా ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దీంతో హోర్ముజ్‌ను మళ్లీ తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడారు. హోర్ముజ్‌ను మూసేసి ప్రపంచానికి ఇబ్బందులు కలిగించాలని ఇరాన్ భావించిందని, ఇప్పుడు వారే బొక్కబోర్లా పడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. ‘హోర్ముజ్ జలసంధిలో రవాణా నిలిచిపోవడంతో వెంటనే ఆ జలసంధిని వారు (ఇరాన్) తిరిగి తెరవాలనుకుంటున్నారు. ఎందుకంటే, హోర్ముజ్ ద్వారా రవాణా జరగకపోవడంతో ఇరాన్ వద్ద డబ్బులు లేవు. డబ్బులు లేకపోవడంతో వారు చచ్చిపోతున్నారు. ఇరాన్‌కు ప్రధాన ఆదాయ వనరు హోర్ముజ్ జలసంధే. ఇప్పుడు ఆ మార్గమే నిలిచిపోవడంతో ఇరాన్‌కు ఆర్థికంగా నష్టాలు వస్తున్నాయి. హోర్ముజ్‌ను మూసేసి ప్రపంచానికి ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నించారు. ఇప్పుడు వారు తవ్వుకున్న గొయ్యిలో వారే పడ్డారు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మిలిటరీ చరిత్రలోనే అతిపెద్ద దిగ్బంధనం
హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం మిలిటరీ చరిత్రలోనే అతిపెద్దదని ట్రంప్ పేర్కొన్నారు. ఇతర దేశాలు ఆ జలసంధి ద్వారా రవాణా చేసుకునేందుకు అనుమతి ఇచ్చామని, ఒక్క ఇరాన్‌ను మాత్రమే దిగ్బంధించామని ఆయన చెప్పారు. దీంతో ఇరాన్ దారికి వచ్చి ఇప్పుడు హోర్ముజ్‌ను తిరిగి తెరవాలని అమెరికాను కోరుకుంటోందని, ఈ విషయంపై చర్చలు జరపాలనుకుంటోందని అన్నారు. కాగా.. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న ఇరాన్ ప్రతిపాదనను ఇంతకుముందు ట్రంప్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించడంతో హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. ఆ మార్గంలో రవాణా చేసే నౌకలపై దాడులు చేస్తామని హెచ్చరించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఏఐ వాయిస్ క్లోనింగ్‌తో ఇటలీ బ్యాంక్‌కు టోకరా
ఇరాన్‌తో డీల్ ప్రసక్తే లేదు..!
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..