Share News

ఏఐ వాయిస్‌ క్లోనింగ్‌తో ఇటలీ బ్యాంక్‌కు టోకరా

ABN , Publish Date - Sep 27 , 2026 | 06:26 AM

హాలీవుడ్‌ సినిమా ‘మిషన్‌ ఇంపాజబుల్‌’లోని సన్నివేశాల స్థాయిలో ఇటలీలోని ఓ ప్రైవేటు బ్యాంకుకు సైబర్‌ నేరగాళ్లు మస్కా కొట్టారు. కృత్రిమ మేధ(ఏఐ)ను వాడి ఏకంగా రూ.1,034 కోట్లు కొట్టేశారు.

ఏఐ వాయిస్‌ క్లోనింగ్‌తో ఇటలీ బ్యాంక్‌కు టోకరా
AI voice cloning scam

  • దాదాపు రూ.1034 కోట్లు కొట్టేసిన సైబర్‌ కేటుగాళ్లు

  • అధికారుల అప్రమత్తతతో డబ్బు వెనక్కి

రోమ్‌, సెప్టెంబరు 26 : హాలీవుడ్‌ సినిమా ‘మిషన్‌ ఇంపాజబుల్‌’లోని సన్నివేశాల స్థాయిలో ఇటలీలోని ఓ ప్రైవేటు బ్యాంకుకు సైబర్‌ నేరగాళ్లు మస్కా కొట్టారు. కృత్రిమ మేధ(ఏఐ)ను వాడి ఏకంగా రూ.1,034 కోట్లు కొట్టేశారు. ఏఐ వాయిస్‌ క్లోనింగ్‌ సాంకేతికతను వాడి ఉన్నతాధికారుల గొంతుతో బ్యాంకు అధికారులకు ఫోన్లు చేసి 95మిలియన్‌ యూరోలు, భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.1,034 కోట్లు బదిలీ చేయించుకున్నారు. ఇటలీలోని అతిపెద్ద బ్యాంకు ఇంటెసా శాన్‌పాలో సంబంధిత విభాగమైన ఫిడియురామ్‌(వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం)లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ మోసం ‘రాయిటర్స్‌’ కథనంతో ఆలస్యంగా బయటకొచ్చింది.


ఫిడియురామ్‌ చైర్మన్‌ పాలో మోలెసిని వాట్సా్‌పకు ఫిబ్రవరిలో వచ్చిన ఓ సందేశంతో ఈ మోసం మొదలైంది. విదేశీ లావాదేవీల విషయంలో అత్యవసర సాయం కావాలంటూ ఇంటెసా శాన్‌పాలో సీఈవో మెసేజ్‌ చేసినట్టు ఆ సందేశం ఉంది. అనంతరం ఓ ప్రముఖ న్యాయ సంస్థలోని సీనియర్‌ అధికారి, న్యాయవాది గొంతుతో మోలెసినికి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఫోన్‌లోని న్యాయవాది గొంతు శాన్‌పాలో సీఈవో ఆదేశాన్ని ధ్రువీకరించింది. దీంతో ఇదంతా నిజమని నమ్మిన మోలెసిని.. నిధుల బదిలీకి తమ ఆర్థిక విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో చైనా, హాంకాంగ్‌ సహా వివిధ దేశాలకు చెందిన బ్యాంకు ఖాతాలకు 95 మిలియన్‌ యూరోలు బదిలీ అయ్యాయి.


అయితే, ఈ అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన ఫిడియురామ్‌.. వెంటనే చైనా, పోర్చుగల్‌, ఇటలీలోని అదికారులను సంప్రదించింది. వారి సహకారంతో దాదాపు 53 మిలియన్‌ యూరోలను వెనక్కి రప్పించుకొంది. మిగిలిన డబ్బును సైబర్‌ నేరగాళ్లు అప్పటికే వేర్వేరు ఖాతాల ద్వారా మళ్లించి క్రిప్టో కరెన్సీగా మార్చినట్టు తెలిసింది. కాగా, ఫిడియురామ్‌ చైర్మన్‌ మోలెసిని ఈ ఏడాది మార్చిలో తన పదవికి రాజీనామా చేశారు. ఫిబ్రవరిలో జరిగిన ఈ సైబర్‌ మోసమే మోలెసిని రాజీనామాకు కారణమని ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:
పాలిచ్చే బర్రెను కాదని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నరు: కేటీఆర్‌

నల్సార్‌లో ఉమర్‌ ఖలీద్‌పై డాక్యుమెంటరీ ఎలా ప్రదర్శించారు: రాజాసింగ్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 06:39 AM