ఇరాన్‌తో డీల్ ప్రసక్తే లేదు..!
ABN , Publish Date - Sep 27 , 2026 | 06:02 AM
దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు.
మిడ్ ఎన్నికల తర్వాత మరోసారి ఆ దేశంపై బాంబుదాడులు
తన యంత్రాంగానికి ట్రంప్ ఆదేశాలు
వాషింగ్టన్, సెప్టెంబరు 26: దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. అమెరికాలో నవంబరు 3వ తేదీన మిడ్‌టర్మ్ ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి ఇరాన్‌పై బాంబుదాడులతో విరుచుకుపడాలని తన యంత్రాంగానికి అంతర్గతంగా ట్రంప్ ఆదేశాలిచ్చినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వార్తా సంస్థ శనివారం పేర్కొంది. ఇరాన్ డీల్‌ను తిరస్కరిస్తున్నట్లుగా సంకేతమిస్తూ ఆయన శనివారం హోర్ముజ్ జలసంధి చిత్రాన్ని ‘ట్రంప్ జలసంధి’ అని పేర్కొంటూ ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. యుద్ధానికి ముగింపు పలకాలంటే తమపై విధించిన అన్ని రకాల ఆంక్షలను ఏడురోజుల్లో ఎత్తివేయటంతోపాటు హోర్ముజ్ జలసంధిపై విధించిన దిగ్బంధనాన్ని తొలగించాలని ఇరాన్ ప్రతిపాదించింది.
పాతాళానికి ట్రంప్ గ్రాఫ్
ట్రంప్‌పై రోజు రోజుకు అమెరికా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. గత 36 ఏళ్లలో మధ్యంతర ఎన్నికకు ముందు ఏ అమెరికా అధ్యక్షుడికీ రానంత తక్కువ అప్రూవల్ రేటింగ్ ట్రంప్‌కు వచ్చింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ తాజాగా నిర్వహించిన పోల్‌లో ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 37 శాతానికి పడిపోగా, 61ు వ్యతిరేకత నమోదైంది. 1990 తర్వాత మిడ్‌టర్మ్ పోలింగ్‌కు ముందు ఇంత తక్కువ స్థాయి ఆమోదం ఏ అధ్యక్షుడికి తమ పోలింగ్‌లో రాలేదని వాల్‌స్ట్రీట్ పేర్కొంది. ఇరాన్‌తో యుద్ధం, ఇంధన ధరల కారణంగా ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత పెరుగుతోంది.
‘భద్రతా మండలిలో భారత్’కు రష్యా మద్దతు
ఐరాస భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్‌ల శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతిచ్చింది. అదే సమయంలో మరిన్ని పశ్చిమ దేశాలకు ఆ అవకాశం కల్పించరాదని గట్టిగా పేర్కొంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ యూఎన్ జనరల్ అసెంబ్లీలో శనివారం మాట్లాడుతూ.. ముఖ్యంగా జర్మనీ, జపాన్‌లకు భద్రతా మండలిలో అవకాశం ఇవ్వవద్దని కోరారు. భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి రష్యా చాలా కాలంగా మద్దతునిస్తోంది.