Share News

ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సపోర్ట్.. ఉక్రెయిన్ వద్ద తిరుగులేని ఆధారాలు!

ABN , Publish Date - Mar 24 , 2026 | 07:18 AM

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక విషయాన్ని వెల్లడించారు. పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించడానికి రష్యా తన నిఘా వ్యవస్థలను ఉపయోగించి ఇరాన్‌కు సహాయం చేస్తోందని, దీనికి సంబంధించి తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు.

ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సపోర్ట్.. ఉక్రెయిన్ వద్ద తిరుగులేని ఆధారాలు!
Russia Iran intelligence support

ఆంధ్రజ్యోతి, మార్చి 24: అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతోన్న యుద్ధంలో ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. దీనికి సంబంధించి తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు చేశారు. పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించడానికి రష్యా తన నిఘా వ్యవస్థలను ఉపయోగించి ఇరాన్‌కు సహాయం చేస్తోందని ఆయన చెప్పారు. ఇదే అంశం మీద అంతర్జాతీయ దినపత్రిక వాషింగ్టన్ పోస్ట్ ఇటీవల ఒక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే.

నిఘా సమాచార మార్పిడి:

రష్యా తన సొంత రేడియో-టెక్నికల్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను ఉపయోగించి సేకరించిన సమాచారాన్ని ఇరాన్ ప్రభుత్వంతో పంచుకుంటోందని జెలెన్‌స్కీ తెలిపారు. అమెరికా, ఇతర మిత్రదేశాల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న దాడులకు ఈ నిఘా సమాచారం ఎంతో కీలకంగా మారుతోందని ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ (HUR) గుర్తించిందని ఆయన వెల్లడించారు. ఈ సహకారం కేవలం ఇద్దరు మిత్రుల మధ్య సంబంధం కాదని, ఇది ప్రపంచ భద్రతకు ముప్పు కలిగించే విధ్వంసక చర్య అని జెలెన్‌స్కీ అభివర్ణించారు. రష్యా, ఇరాన్ పాలకులు ద్వేషంలో తోబుట్టువులని.. అందుకే అవి ఆయుధాల విషయంలోనూ భాగస్వాములుగా మారాయని జెలెన్‌స్కీ అన్నారు.


గత కొంతకాలంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ తయారు చేసిన 'షాహెద్' (Shahed) డ్రోన్లను రష్యా విరివిగా ఉపయోగిస్తోందని, దీనికి ప్రతిఫలంగా రష్యా ఇప్పుడు ఇరాన్‌కు అత్యాధునిక నిఘా సమాచారాన్ని, శాటిలైట్ చిత్రాలను టెక్నాలజీని అందిస్తోందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. రష్యా తన యుద్ధ క్షేత్రాన్ని ఉక్రెయిన్ నుంచి పశ్చిమాసియాకి విస్తరించే ప్రయత్నంలో భాగంగానే ఇరాన్‌తో చేతులు కలిపిందని ఉక్రెయిన్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు తక్షణమే స్పందించి, ఈ అక్రమ నిఘా మార్పిడిని అడ్డుకోవాలని ఉక్రెయిన్ కోరుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Health News And Telugu News

Updated Date - Mar 24 , 2026 | 08:11 AM