ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. హోరెత్తిన నిరసనలు!
ABN , Publish Date - Mar 01 , 2026 | 01:22 PM
ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ మృతికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల్లో నిరసనలు హోరెత్తాయి. భారత్‌లోని లద్ధాఖ్, పాకిస్థాన్‌లోని కరాచీ ప్రాంతాల్లో.. ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక నినాదాలతో నల్ల జెండాలు పట్టుకుని ఇరాన్‌పై దాడులను ఖండించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఆయన మృతికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. జమ్ముకశ్మీర్ లెహ్‌లోని లద్ధాఖ్ ప్రాంతంలో షియా ముస్లింలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇరాన్‌పై దాడులను ఖండిస్తూ.. ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఇరాన్‌కు సంఘీభావం తెలుపుతూ.. ఖమేనీ చిత్రాలు, నల్ల జెండాలు, ఇరాన్‌కు మద్దతిచ్చే బ్యానర్లతో ఈ నిరసనలు చేపట్టారు. 'నేడు మా ప్రియతమ నాయకుడు అలీ ఖమేనీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంతాప సభను మా నగరంలో శాంతియుతంగా నిర్వహిస్తాం' అని ఓ నిరసనకారుడు అన్నారు.
పాక్‌లోనూ..
పాకిస్థాన్‌లోనూ ఇరాన్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో కరాచీలోని అమెరికా కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ మద్దతుదారులు మూకుమ్మడిగా కర్రలు, రాళ్లతో అమెరికన్ కాన్సులేట్ భవనంపై దాడికి దిగారు. అక్కడి పలు భవనాలకు నిప్పంటించినట్టు సమాచారం. అయితే.. ఆందోళనకారులను అడ్డుకోవడంలో భాగంగా భద్రతా సిబ్బంది కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో పలువురు నిరసనకారులు మృతిచెందినట్టు తెలుస్తోంది.
మరోవైపు.. ఖమేనీ మరణం పట్ల సంతాపం తెలిపేందుకు మధ్య ఇరాన్‌లోని ఇస్‌ఫహాన్ నగర ప్రజలు ఇమామ్ స్క్వేర్ వద్దకు చేరుకున్నారు. వారంతా సమూహంగా ఏర్పడి దివంగత సుప్రీం లీడర్‌కు సంతాపం తెలిపారని అక్కడి ఇస్లామిక్ రిపబ్లిక్ వెల్లడించింది. అలాగే ఇరాన్ ఈశాన్య నగరమైన మషాద్‌లోని ఇమామ్ రెజా మందిరం వద్ద కూడా ప్రజలు పెద్దఎత్తున గుమిగూడారని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్.. దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని ప్రకటించింది. ఈ సందర్భంగా ఖమేనీకి సంతాపం తెలుపుతూ.. ఆ దేశంలో సగం ఎత్తులో జెండాలను ఎగురవేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలో 37 ఏళ్ల అధ్యాయానికి తెరపడిందని ప్రజా సమావేశాలు ఏర్పాటుచేసి నివాళులర్పించారు.
వారసుడు ఎవరంటే?
ఖమేనీ మరణంతో కొత్త సుప్రీం నాయకుడి పేరును ప్రకటించింది ఇరాన్. అయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడైన మోజ్తబా ఖమేనీ.. తదుపరి లీడర్‌గా కొనసాగుతారని పేర్కొంది. ప్రస్తుతం.. ఖోమ్ నగరంలోని విద్యాలయంలో మతాచార్యుడిగా పనిచేస్తున్న మొజ్తబా.. ఇకపై ఖమేనీ వారసుడిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 1987-88లో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో మొజ్తబా పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
ఇరాన్ ప్రతీకార దాడుల్లో ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాను సమీపించిన డ్రోన్!
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. నిర్ధారించిన ఇరాన్ సైన్యం
అల్లాకు చేసిన ప్రతిజ్ఞ నెరవేరింది.. ఖమేనీ ఎక్స్ హ్యాండిల్‌లో ఖురాన్ పోస్ట్..