సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. ఇరాన్ వీధుల్లో సంబరాలు!
ABN , Publish Date - Mar 01 , 2026 | 10:51 AM
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెనీ మృతితో ఆ దేశంలోని పలుచోట్ల పండగ వాతావరణం నెలకొంది. ఆయన మరణ వార్త పలువురిలో విషాదం నింపినప్పటికీ.. రాజకీయ సంక్షోభం, అవినీతి, నిరసనల కారణంగా పలువర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఖమేనీ పాలన ముగిసిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. పలుచోట్ల ఇరానియన్లు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.
ఖమెనీ పాలనా కాలంలో ఆ దేశ ప్రజలు చాలాసార్లు కఠిన నిబంధనలను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మృతితో ఇరాన్లో పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు ఆందోళనకారులు. పలు నగరాల్లో కేకలు వేస్తూ, బాణా సంచా కాల్చుతూ సంబరాలు చేసుకోగా.. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతమొందాలనే నినాదాలతో అక్కడి వీధులు మార్మోగినట్టు తెలుస్తోంది. ఆ దేశంలోని పలువురు మహిళలు హిజాబ్ తీసేసి మరీ సంబారాల్లో పాల్గొన్నారు. తమ నియంత మరణించాడని హర్షం వ్యక్తం చేస్తూ వీధుల్లో స్టెప్పులేశారు.
మరోవైపు.. ఖమేనీ మరణం పట్ల ఆ దేశ రాజవంశానికి చెందిన వారసుడు, యువరాజు రాజ పహ్లవీ స్పందించారు. తమ నిరంకుశ నాయకుడు, పదివేల మంది ఇరానీయన్లను బలిగొన్న నర హంతకుడు ఖమేనీ మట్టిలో కలిసిపోయాడని వ్యాఖ్యానించారు. 'ఖమేనీ మరణంతో ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన ఇక ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే ఇది చెత్తబుట్టను చేరుతుంది. ఖమేనీ వారసుణ్ని నియమించేందుకు.. ఈ వ్యవస్థలో మిగిలిన శక్తులు ఎలాంటి చర్యలు చేపట్టినా అవి పూర్తిగా విఫలమవుతాయి. ఖమేనీ స్థానంలో ఎవరొచ్చినా.. వారికి చట్టబద్ధత ఉండదు. వారు కూడా నిస్సందేహంగా ఈ పాలకులు చేసిన నేరాల్లో భాగస్వాములవుతారు' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు రెజా.
ఖమేనీ మరణవార్త కొందరికి ఓదార్పుగా ఉంటుందని రెజా అన్నారు. 'నేరస్థుడైన ఖమేనీ మరణం.. ఇరాన్ లయన్ అండ్ సన్ నేషనల్ రివల్యూషన్ కోసం తమ ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకు, బాధిత తల్లులకు, గాయపడిన పిల్లల హృదయాలకు ఓదార్పు అవుతుంది. ఖమేనీ మృతితో ఇస్లామిక్ రిపబ్లిక్ శకం ముగిసింది. ఇప్పటికైనా ఇరాన్ సైన్యం(ఐఆర్‌జీసీ), పోలీసులు, భద్రతా దళాలు ప్రజలతో మమేకం కావాలి. కూలిపోతున్న వ్యవస్థను కాపాడేందుకు వారు ప్రయత్నించవద్దు. దేశ సైన్యానికి ఇప్పుడో గొప్ప అవకాశం లభించింది. స్వేచ్ఛాయుతమైన ఇరాన్‌ను నిర్మించేందుకు భాగస్వాములుకండి' అని ఆ దేశ సైన్యాన్ని ఉద్దేశించి అన్నారు.
ఇవీ చదవండి:
ఇరాన్ ప్రతీకార దాడుల్లో ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాను సమీపించిన డ్రోన్!
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. నిర్ధారించిన ఇరాన్ సైన్యం
అల్లాకు చేసిన ప్రతిజ్ఞ నెరవేరింది.. ఖమేనీ ఎక్స్ హ్యాండిల్‌లో ఖురాన్ పోస్ట్..