Share News

ఇరాన్ ప్రతీకార దాడుల్లో ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాను సమీపించిన డ్రోన్!

ABN , Publish Date - Mar 01 , 2026 | 09:12 AM

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ సంయుక్త దాడులు.. ఇరాన్‌ ప్రతిదాడుల నేపథ్యంలో దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సమీపంలో డ్రోన్ కనిపించినట్టు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఆ సమయంలో ఆ భవన ప్రాంతంలో నల్లటి పొగలు కమ్ముకున్న వీడియోను ప్రసారం చేశాయి.

ఇరాన్ ప్రతీకార దాడుల్లో ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాను సమీపించిన డ్రోన్!
Burj Khalifa

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్, అమెరికాలపై ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడులు యూఏఈని వణికించాయి. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాను ఇరాన్ క్షిపణి సమీపించినట్టు సమాచారం. ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనంగా పేరొందిన బుర్జ్ ఖలీఫా ప్రాంతంలో ఇరానియన్ డ్రోన్ కనిపించినట్టు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వీడియోలను విడుదల చేశాయి. బుర్జ్ ఖలీఫా సమీపమంతా దట్టమైన పొగలు వ్యాపించినట్టు ఆ దృశ్యాలలో కనిపిస్తోంది. నగర వ్యాప్తంగా పేలుళ్లు సంభవించడంతో బుర్జ్ ఖలీఫా భవనంలో ఉంటున్నవారిని వెంటనే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ భవనం దాడికి గురైందా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.


ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బుర్జ్ ఖలీఫా భవనం దుబాయ్ నడిబొడ్డున ఉంటుంది. సుమారు 828.8 మీటర్ల(2,722 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ భవనం విలువ సుమారు 1.5 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ప్రారంభంలో బుర్జ్ దుబాయ్‌గా పిలిచిన ఈ భవనం మెగాటాల్ ఆకాశహర్మ్యంగా పేరొందింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దీని నిర్మాణాన్ని స్కిడ్‌మోర్, ఓవింగ్స్, మెర్రిల్‌లు నిర్మించారు. 2004లో దీని నిర్మాణం ప్రారంభం కాగా.. 2009లో పూర్తైంది. భవనంలోని 124, 125, 148వ అంతస్తులు ఏటా ప్రత్యేకంగా ముస్తాబై మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తాయి. అయితే.. ఈ భవన ప్రధాన నిర్మాణాన్ని కవర్ చేసే దాని డెవలపర్ ఎమ్ఆర్ ప్రాపర్టీస్ దాదాపు 1.5 బిలియన్ డాలర్లకు బీమా చేసిందని తెలుస్తోంది. అందులోని వ్యక్తిగత అపార్ట్‌మెంట్లు, హోటల్ ఇంటీరియర్లు, కార్యాలయాలను ఆయా యజమానులు విడిగా బీమా చేయించినట్టు సమాచారం.


నలుగురికి గాయాలు

ఆదివారం తెల్లవారుజామున.. దుబాయ్‌లోని ఐకానిక్ పామ్ జుమేరా ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ దాడిలో పలు భవనాలు మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో నల్లటి పొగలు ఎగసిపడ్డాయి. పేలుడు తర్వాత పెద్దఎత్తున శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. అనంతరం.. సహాయక చర్యల నిమిత్తం అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురికి గాయలవగా.. వారు చికిత్స పొందుతున్నారని స్థానిక మీడియా ధ్రువీకరించింది. పేలుడు జరిగిన కాసేపటికి మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపింది. ఇక.. స్థానికులు, పర్యాటకులు ప్రశాంతంగా ఉండాలని, అక్కడి సంఘటనా దృశ్యాలను సోషల్ మీడియాలో ప్రసారం చేయొద్దని అధికారులు వారికి సూచించారు.


గగనతలాల మూసివేత

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ సంయుక్త దాడులు.. ఇరాన్‌ ప్రతిదాడుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఇరాన్‌, ఇజ్రాయెల్‌, ఇరాక్‌, జోర్డాన్‌, ఖతార్‌, బహ్రెయిన్‌, కువైట్, యూఏఈ, సిరియాలు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాకు అన్ని విమానాల రాకపోకలను ఆదివారం వరకు నిలిపివేస్తున్నట్టు శనివారం ఇండిగో, ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిర్‌ఇండియాలు ప్రకటించాయి. కాగా.. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఆయా దేశాల్లోని భారత ఎంబసీలు సూచించాయి. ఇరాన్‌, ఇజ్రాయెల్‌, లెబనాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌, ఒమన్‌, ఇరాక్‌, జోర్డాన్‌, కువైట్, ఖతార్‌ దేశాల గగనతలాలకు మార్చి 2 వరకు దూరంగా ఉండాలని ఇండియన్ ఎయిర్‌ లైన్స్‌ సంస్థలకు సూచించింది డీజీసీఏ.


ఇవీ చదవండి:

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. నిర్ధారించిన ఇరాన్ సైన్యం

అల్లాకు చేసిన ప్రతిజ్ఞ నెరవేరింది.. ఖమేనీ ఎక్స్ హ్యాండిల్‌లో ఖురాన్ పోస్ట్..

Updated Date - Mar 01 , 2026 | 09:25 AM