Share News

అత్యంత భయంకరమైన వ్యక్తి చనిపోయాడు.. ఖమేనీపై ట్రంప్ పోస్ట్

ABN , Publish Date - Mar 01 , 2026 | 07:01 AM

శనివారం టెహ్రాన్‌లోని నివాసంపై జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు.

అత్యంత భయంకరమైన వ్యక్తి చనిపోయాడు.. ఖమేనీపై ట్రంప్ పోస్ట్
Donald Trump Iran statement,

ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌ నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా శనివారం ఉదయం టెహ్రాన్‌పై దాడులకు పాల్పడ్డాయి. టెహ్రాన్‌లోని మొత్తం 30 ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ నివాసాన్ని టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడులకు దిగాయి. శనివారం జరిగిన ఈ దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి జెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ఖమేనీ చనిపోయాడనడానికి చాలా సంకేతాలు ఉన్నాయన్నారు.


ట్రంప్ పోస్ట్..

శనివారం జరిగిన దాడుల్లో ఖమేనీ చనిపోయాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ది ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘చరిత్రలోనే అత్యంత భయంకరమైన వ్యక్తి ఖమేనీ చనిపోయాడు. ఖమేనీ కారణంగా.. అతడి గ్యాంగ్ కారణంగా అత్యంత దారుణంగా హత్యకు గురైన ఇరాన్, అమెరికా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దేశాల ప్రజలకు న్యాయం జరిగింది. దేశాన్ని తిరిగి సొంతం చేసుకోవటానికి ఇరాన్ ప్రజలకు దక్కిన అద్భుతమైన అవకాశం ఇదే. ఇరాన్‌పై నిరంతరంగా భారీ బాంబు దాడులు కొనసాగుతాయి’ అని రాసుకొచ్చారు.
trump.jpg


ఖమేనీ బతికే ఉన్నారు: ఇరాన్

శనివారం టెహ్రాన్‌లోని ఖమేనీ నివాసంపై జరిగిన దాడుల్లో ఖమేనీ చనిపోయాడని అమెరికా, ఇజ్రాయెల్ దేశాధినేతలు విడివిడిగా ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలపై ఇరాన్ స్పందించింది. తమ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడన్న వార్తల్ని ఖండించింది. ఖమేనీ సురక్షితంగా ఉన్నాడని ప్రకటించింది. గల్ఫ్‌లోని 14 అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేశామని తెలిపింది. వందలాది మంది అమెరికా సైనికులను హతమార్చామని వెల్లడించింది. ఊహించని రీతిలో ముగింపు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, ఇరాన్‌కు చెందిన పలు మీడియా సంస్థలు మాత్రం ఖమేనీ చనిపోయాడని నిర్ధారిస్తూ వార్తలు ప్రసారం చేస్తున్నాయి.


ఇవి కూడా చదవండి

బహ్రెయిన్‌లో తెలుగు ప్రజల ఆందోళన

క్షతగాత్రులకు డిప్యూటీ సీఎం పవన్‌ పరామర్శ

Updated Date - Mar 01 , 2026 | 07:14 AM