Share News

బహ్రెయిన్‌లో తెలుగు ప్రజల ఆందోళన

ABN , Publish Date - Mar 01 , 2026 | 07:05 AM

బహ్రెయిన్‌లోని యూఎస్‌ నేవీ బేస్‌పై ఇరాన్‌ క్షిపణి దాడులతో.. ఆ దేశంలో ఉంటున్న తెలుగు రాష్ర్టాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

బహ్రెయిన్‌లో తెలుగు ప్రజల ఆందోళన

  • యూఎస్‌ నేవీ బేస్‌పై ఇరాన్‌ దాడితో భయాందోళన

విజయవాడ/గుడ్లవల్లేరు, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): బహ్రెయిన్‌లోని యూఎస్‌ నేవీ బేస్‌పై ఇరాన్‌ క్షిపణి దాడులతో.. ఆ దేశంలో ఉంటున్న తెలుగు రాష్ర్టాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ర్టాలకు చెంది న సుమారు 50 వేల మంది ప్రజలు బ్రహెయిన్‌లో నివసిస్తున్నారు. బహ్రెయిన్‌ రాజధాని మనామాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. బహ్రెయిన్‌లో యూఎస్‌ నేవీ బేస్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న జూఫర్‌ ప్రాంతంలో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు గ్రామానికి చెందిన వల్లభనేని ప్రవీణ్‌ కుటుంబం నివసిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులుగా పనిచేసిన వల్లభనేని బాబూరావు సోదరుడైన వల్లభనేని సత్యనారాయణ కుమారుడే ప్రవీణ్‌. బహ్రెయిన్‌ దేశంలో ఎస్కలేటర్స్‌ కంపెనీలో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గత పది రోజులుగా ఆ దేశ అధికారులు దాడులు జరగవచ్చని స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్టు ప్రవీణ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. యూఎస్‌ బేస్‌ క్యాంప్‌ మీద దాడులు జరగటంతో కొంత ఆందోళన కలిగిందని చెప్పారు. బహ్రెయిన్‌, భారత ఎంబసీలు తమతో నిత్యం టచ్‌లో ఉంటున్నాయని, ఇప్పటి వరకు సురక్షితంగానే ఉన్నామని చెప్పారు.

Updated Date - Mar 01 , 2026 | 07:05 AM