పాక్ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్... నలుగురు ఉగ్రవాదులు హతం!
ABN , Publish Date - Oct 19 , 2026 | 02:56 PM
పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఆర్మీ మేజర్ మరణించగా.. నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఆర్మీ మేజర్ మరణించగా.. నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం సాయంత్రం సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పాక్ సైనిక వర్గాలు ఇవాళ(సోమవారం) అధికారికంగా వెల్లడించాయి. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...
గ్వాదర్ జిల్లాలోని షాదీ కౌర్ ప్రాంతంతో పాటు కలాత్ జిల్లాలోని జట్టాకాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలపై అందిన నిఘా వర్గాల సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. కలాత్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అలానే వారి వద్ద నుంచి భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది.
మరోవైపు గ్వాదర్ జిల్లా షాదీ కౌర్ ప్రాంతంలో క్లియరెన్స్ ఆపరేషన్ నిర్వహిస్తున్న బలగాల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీ (IED) పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మేజర్ వజాహత్ వహీద్ మరణించారు. వహీద్ మృతికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతాపం వ్యక్తం చేశారు. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మేజర్ త్యాగాన్ని ఆయన ప్రశంసించారు. బలోచిస్తాన్‌లో శాంతిభద్రతలను కాపాడేందుకు ఉగ్రవాద ఏరివేత చర్యలు కొనసాగుతున్నట్లు సైనిక అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
‘ఎవరినీ వదిలిపెట్టం’.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల నేపథ్యంలో సీఎం ఫడ్నవీస్ వార్నింగ్
టైగర్ ష్రాఫ్ కాల్పుల ఘటనతో వెలుగులోకి అనిల్ పండిట్ పేరు.. ఇంతకీ అతడెవరు?