బుల్లెట్ వేగంతో ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్!
ABN , Publish Date - Jul 17 , 2026 | 04:53 PM
దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఈ ప్రాజెక్టు సంబంధించి భారత్-జపాన్ దేశాల మధ్య తాజాగా జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి.
న్యూఢిల్లీ, జులై 17: దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ (MAHSR) పనులు శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా భారత్-జపాన్ దేశాల మధ్య తాజాగా జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. ఇరు దేశాల ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ప్రాజెక్ట్ పురోగతిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027 నాటికే ప్రాజెక్టుకు సంబంధించిన తొలి కారిడార్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
జపాన్ అందించబోయే సరికొత్త 'E10 సిరీస్' బుల్లెట్ రైళ్లు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున, ప్రాజెక్ట్ ప్రారంభంలో జాప్యం జరగకుండా ఉండేందుకు భారత్ కీలక వ్యూహాన్ని రచించింది. తొలుత స్వదేశీ సాంకేతికతతో తయారయ్యే హైస్పీడ్ రైళ్లతోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. మరోవైపు, జపాన్‌కు చెందిన అత్యాధునిక, అత్యంత వేగవంతమైన 'E10 సిరీస్' బుల్లెట్ రైళ్లు 2030 నాటికి భారత దేశానికి చేరుకోనున్నాయి.
ఈలోపు దేశీయంగా తయారవుతున్న రైళ్లతోనే తొలి విడత సర్వీసులను నడపనున్నారు. గుజరాత్, మహారాష్ట్రల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించే ఈ మెగా ప్రాజెక్ట్.. ఇరు దేశాల సాంకేతిక భాగస్వామ్యానికి, భారత రవాణా రంగ విప్లవానికి సరికొత్త మైలురాయిగా నిలవనుంది. మహారాష్ట్ర వైపు పనుల్లో వేగం పెంచడంతో పాటు, సివిల్ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకోవడంతో అనుకున్న లక్ష్యాన్ని ముందే ముద్దాడేందుకు రైల్వే శాఖ సర్వసన్నద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించిన కొన్ని గంటలకే ఈ తాజా అప్‌డేట్ వచ్చింది. హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న కొన్ని ప్రత్యేక దేశాల సరసన భారత్ చేరింది.
ఇవి కూడా చదవండి:
మీ పేరు ముందు డాక్టర్‌ను తొలగించండి: సుప్రీం కోర్టు
ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఈడీ దూకుడు