Share News

మిస్ యూనివర్స్ 2026 కొత్త కిరీటం ఆవిష్కరణ.. పోటీలకు 15 దేశాలు దూరం

ABN , Publish Date - Nov 13 , 2026 | 07:19 PM

ప్యూర్టోరికోలో ఈనెల 24న మిస్‌ యూనివర్స్‌-2026 పోటీలు జరగనున్నాయి. మరికొద్ది రోజుల్లో విశ్వసుందరి కిరీటాన్ని కొత్త విజేతకు అలంకరించనున్నారు. ఈ నేపథ్యంలో మిస్‌ యూనివర్స్‌ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన సరికొత్త కిరీటాన్ని ఆవిష్కరించారు.

మిస్ యూనివర్స్ 2026 కొత్త కిరీటం ఆవిష్కరణ.. పోటీలకు 15 దేశాలు దూరం

ఇంటర్నెట్ డెస్క్: ప్యూర్టోరికోలో ఈనెల 24న మిస్‌ యూనివర్స్‌-2026 పోటీలు జరగనున్నాయి. మరికొద్ది రోజుల్లో విశ్వసుందరి కిరీటాన్ని కొత్త విజేతకు అలంకరించనున్నారు. ఈ నేపథ్యంలో మిస్‌ యూనివర్స్‌ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన సరికొత్త కిరీటాన్ని ఆవిష్కరించారు. మిస్‌ యూనివర్స్‌ 75 ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా ఆవిష్కరించిన కొత్త కిరీటానికి 'ది రేడియన్స్‌ ఆఫ్‌ యాన్‌ ఎటర్నల్‌ లెగసీ' అని పేరు పెట్టారు. ఈ కిరీటాన్ని జార్జ్‌ విటెల్స్‌, మైసన్‌ డిఓఆర్‌ సంస్థల సహకారంతో రూపొందించారు. 18 క్యారెట్ల వైట్‌ గోల్డ్‌తో తయారు చేసిన ఈ కిరీటంలో ఏకంగా 3,150 వజ్రాలను పొదిగారు.


మూడు ప్రధాన వజ్రాలు వీటికి ప్రతీక..

ఈ కిరీటంలోని మూడు ప్రధాన వజ్రాలు మిస్‌ యూనివర్స్‌ ప్రస్థానంలోని గతం, వర్తమానం, భవిష్యత్తుకు ప్రతీకలుగా నిలుస్తాయని నిర్వాహకులు వెల్లడించారు. ఎడమవైపు ఉన్న వజ్రం.. అడ్డంకులను అధిగమించి మహిళలకు మార్గదర్శకంగా నిలిచిన వారిని, పోటీకి 75 ఏళ్ల చరిత్రను అందించిన మహిళలను గౌరవించేందుకు రూపొందించారు. కుడివైపు వజ్రం.. సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్న మహిళలకు గుర్తుగా రూపొందించారు. ఇక మధ్యలో మిస్‌ యూనివర్స్‌ చిహ్నమైన నక్షత్రానికి దిగువన అమర్చిన అతిపెద్ద వజ్రం భవిష్యత్తులో ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే మహిళలకు ప్రతీకగా నిలుస్తుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


వివిధ కారణాలతో 15 దేశాలు దూరం

ఈ ఏడాది పోటీల్లో 15కుపైగా దేశాలు పాల్గొనడం లేదని సమాచారం. ఇందుకు ఆరోగ్యం, వ్యక్తిగత కారణాలతో పాటు వివిధ కారణాలు ఉన్నాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల తాను ఈ పోటీల్లో పాల్గొనడం లేదని విక్టోరియా అమర్సన్ (మిస్ యూనివర్స్ ఆస్ట్రియా) తెలిపింది. అలాగే బల్గేరియాకు చెందిన అనా మరియా బబావ్ కూడా ఇలాగే ప్రకటన చేసింది. తనకు ఇటీవలే కారు ప్రమాదం జరిగిందని, తన ఆరోగ్య పరిస్థితి సహకరించడం లేదని ఆమె వెల్లడించింది. ఇక అమెరికా వీసా ఆంక్షల వల్ల పోటీల్లో పాల్గొనడం లేదని జాంబియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, జింబాబ్వే, దక్షిణ సూడాన్, నేపాల్ దేశాలు తెలిపాయి. కాగా.. ఇండియా తరపున కేరళకు చెందిన కజయ్యా లిజ్ మెజో పాల్గొంటున్నారు.


ఈ వార్తలూ చదవండి

నాతో చర్చకు వస్తే ప్రధాని పదవిలో మోదీ కొనసాగలేరు.. రాహుల్ గాంధీ సవాల్..

సంప్రదాయాలకు భిన్నంగా అనిరుధ్‌-కావ్య వివాహ వేడుక.. ఏమిటా పెళ్లి పద్ధతి..

Updated Date - Nov 13 , 2026 | 07:19 PM