ఏఐ నియంత్రణ సరికాదు.. మార్క్ జుకర్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 29 , 2026 | 10:57 AM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత అభివృద్ధి, నియంత్రణ విధానాలపై సిలికాన్ వ్యాలీలో వాదనలు తారాస్థాయికి చేరాయి. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తాజాగా ప్రముఖ ఏఐ సంస్థల ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్‌ల విధానాలను తప్పుబట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత అభివృద్ధి, నియంత్రణ విధానాలపై సిలికాన్ వ్యాలీలో వాదనలు తారాస్థాయికి చేరాయి. 'మెటా' (Meta) సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తాజాగా ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్‌ల విధానాలను తప్పుబట్టారు. ఏఐ టెక్నాలజీని కఠినమైన నిబంధనలతో నియంత్రించడం అమెరికన్ టెక్నాలజీ విలువలకే తూట్లు పొడవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జుకర్‌బర్గ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కొన్ని ప్రముఖ పరిశోధనా సంస్థలు, కొందరు వ్యక్తులు ఏఐ అభివృద్ధిని తీవ్ర భయాలతో, ముప్పు కోణంలో చూస్తున్నాయని జుకర్‌బర్గ్ మండిపడ్డారు. ఏఐ వల్ల మానవాళికి పెను ముప్పు ఉందనే ప్రచారంలో వాస్తవ దూరమైన అంశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కొద్దిమంది చేతుల్లోనే ఏఐ సాంకేతికత ఉండకుండా, ఎక్కువ మందికి అందుబాటులోకి రావాలని ఆయన బలంగా వాదించారు.
కేంద్రీకృత ఏఐ ద్వారా అందరికీ ప్రయోజనం చేకూరుస్తామనే భావన సరికాదని, అది అసాధ్యమని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. ప్రపంచంలో వివిధ రకాల అభిప్రాయాలు, విలువలు కలిగిన మనుషులు ఉంటారని, అందరికీ ఒకే రకమైన ఏఐ సరిపోదన్నారు. దీనికి బదులుగా ప్రతి ఒక్కరి అవసరాలకు తగినట్లుగా పర్సనలైజ్డ్ సూపర్ ఇంటెలిజెన్స్ (Personalized Superintelligence) అందుబాటులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.
మరోవైపు, ఏఐ సాంకేతికత దుర్వినియోగం కాకుండా కఠిన భద్రతా పరీక్షలు, పకడ్బందీ నిబంధనలు ఉండాలని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ ఇటీవల వాదించారు. ఏఐ భద్రత, ఓపెన్ సోర్స్ విధానాల మధ్య జరుగుతున్న ఈ సైద్ధాంతిక పోరు టెక్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి:
కామన్వెల్త్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్..
ఆ మాటలు వైభవ్‌ను అవమానించినట్లు కాదు: రవిచంద్రన్ అశ్విన్