ఆ మాటలు వైభవ్‌ను అవమానించినట్లు కాదు: రవిచంద్రన్ అశ్విన్
ABN , Publish Date - Jul 29 , 2026 | 08:58 AM
యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా మాజీ క్రికెటర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సహచరులకు నీళ్లు అందించాలంటూ ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై అశ్విన్ స్పష్టతనిచ్చాడు.
స్పోర్ట్స్ డెస్క్: యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా మాజీ క్రికెటర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల తాను చేసిన వైభవ్ సహచరులకు నీళ్లు అందించాలి(సర్వ్ డ్రింక్స్) అనే వ్యాఖ్యలపై అశ్విన్ స్పష్టతనిచ్చాడు. ఆ వ్యాఖ్యలు అతడిని కించపరిచేలా చేయలేదని అన్నాడు. కేవలం బెంచ్‌పై కూర్చోవడం ద్వారా 15 ఏళ్ల ఆ యువ ఆటగాడికి ఎంతో నేర్చుకునే అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతోనే ఆ మాట అన్నానని వివరించాడు. ఈ మేరకు అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పష్టం చేశాడు.
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనే క్రమంలో అతను తీవ్ర ఇబ్బందిపడ్డాడు. అయితే, జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో మాత్రం అద్భుతమైన ఫామ్ కనబరిచి రెండు అర్ధశతకాలు బాది సత్తా చాటాడు.
ఈ నేపథ్యంలో వైభవ్ వైఫల్యాలపై అశ్విన్ మాట్లాడుతూ.. కేవలం కొన్ని వైఫల్యాలతో ఒక యువ ఆటగాడి భవిష్యత్తును నిర్ణయించలేమని స్పష్టం చేశాడు. 'ప్రపంచ క్రికెట్‌లో ఎవరికైనా బలాలతో పాటు బలహీనతలు ఉంటాయి. షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో దిగ్గజ ఆటగాళ్లు కూడా ఔట్ అయిన సందర్భాలున్నాయి. ఇంగ్లండ్‌తో కొన్ని మ్యాచ్‌లు ఆడినంత మాత్రాన అతని కెరీర్‌ను ఇప్పుడే బేరీజు వేయలేం' అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్‌లో వైభవ్ అద్భుత ప్రదర్శన చేయడంతో అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయని, ప్రతి మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలాగా నిలకడగా ఆడాలని ఆశించడం సరికాదన్నాడు. క్రీడాజీవితంలో ఒడిదొడుకులు సహజమని, మైదానం వెలుపల తన బలహీనతలపై కష్టపడితే ఈ యువ సంచలనం భవిష్యత్తులో అద్భుతమైన ఆటగాడిగా ఎదుగుతాడని అశ్విన్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ జట్టుకు గుడ్‌బై చెప్పిన గంభీర్ స్నేహితుడు
అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయుడు