తిలకం పెట్టుకున్నాడని.. పాఠశాలలో 8 ఏళ్ల విద్యార్థిపై వివక్ష
ABN , Publish Date - Jan 20 , 2026 | 03:42 PM
లండన్‌లోని ఓ పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలుడు వివక్షను ఎదుర్కొన్న ఘటన వెలుగులోకి వచ్చింది. తిలకం పెట్టుకుని స్కూల్‌కు రావడం కారణంగా అతడిపై ఉపాధ్యాయులు వివక్షత చూపారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్‌డెస్క్: బ్రిటన్ రాజధాని లండన్‌లోని ఓ పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలుడు వివక్షను(London School Discrimination) ఎదుర్కొన్న ఘటన వెలుగులోకి వచ్చింది. తిలకం పెట్టుకుని స్కూల్‌కు వెళ్లడం కారణంగా పాఠశాల యాజమాన్యం అతడిని వేరుగా చూసినట్లు ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితి వల్ల.. ఆ బాలుడు చివరకు పాఠశాల మార్చుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్‌లో హిందువులు, భారతీయుల తరఫున పనిచేస్తున్న ఇన్‌సైట్ యూకే అనే సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది.
ఇన్‌సైట్ యూకే సంస్థ(Insight UK statement) తెలిపిన వివరాల ప్రకారం.. లండన్‌లోని వికార్స్ గ్రీన్ అనే ప్రైమరీ స్కూల్‌లో ఆ బాలుడు చదివేవాడు. తమ మత సంప్రదాయం ప్రకారం.. రోజూ తిలకం ధరించి తరగతులకు హాజరయ్యేవాడు. అయితే.. పాఠశాల సిబ్బంది అతణ్ని నిత్యం గమనిస్తూ.. మతాచారాలపై పదే పదే ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. విరామ సమయంలోనూ ప్రధానోపాధ్యాయులు బాలుడిపై ప్రత్యేక దృష్టి సారించడంతో అతడు భయపడిపోయాడని ఇన్‌సైట్ యూకే తెలిపింది. దీంతో ఇతర పిల్లలతో కలిసి ఆడటానికీ అతడు వెనుకాడినట్టు పేర్కొంది. మత విశ్వాసాల కారణంగా ఏ విద్యార్థీ ఒంటరితనాన్ని ఎదుర్కోవడం సరికాదని సంస్థ అభిప్రాయపడింది.
తిలకం పెట్టుకున్నాడనే కారణంగా ఆ బాలుడిని పాఠశాలలో పలు బాధ్యతల నుంచి తొలగించారని కూడా ఇన్‌సైట్ యూకే ఆరోపించింది. ఈ తరహా సంఘటనలు పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వారి భద్రతపైనా సందేహాలు కలిగిస్తాయని విమర్శించింది. బాలుడి తల్లిదండ్రులు తమ మతాచారాల గురించి స్కూల్ యాజమాన్యానికి(London primary school controversy) వివరించడానికి ప్రయత్నించినా.. ఎలాంటి మార్పూ కనిపించలేదని తెలిపింది. చివరకు అక్కడి పరిస్థితులను ఎదుర్కోలేక ఆ బాలుడు పాఠశాలను మార్చుకోవాల్సి వచ్చిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలు నిజమని తేలితే.. బ్రిటన్ చట్టాల ప్రకారం ఇది మత వివక్ష కిందకు వస్తుందని యూకే ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇలాంటి కారణాల వల్ల ఇదే పాఠశాల నుంచి ఇప్పటికే నలుగురు విద్యార్థులు వెళ్లిపోయారని ఇన్‌సైట్ యూకే గుర్తు చేసింది.
ఇవీ చదవండి:
ట్రంప్ మమల్ని నట్టేట ముంచేశారు.. ఇరాన్‌లో జనాగ్రహం
ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు