Share News

Harvard University: ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు

ABN , Publish Date - Jan 15 , 2026 | 03:35 PM

అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో భారతీయ విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య భారీగా తగ్గింది. 2024తో పోలిస్తే 2025 ఫాల్ సీజన్‌లో అడ్మిషన్ల సంఖ్య 31 శాతం మేర తగ్గింది.

Harvard University: ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు
Harvard University Admissions

ఇంటర్నెట్ డెస్క్: ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో భారతీయుల అడ్మిషన్లు భారీగా తగ్గాయి. గతేడాది ఫాల్ సీజన్‌లో భారతీయుల అడ్మిషన్లలో 2024తో పోలిస్తే ఏకంగా 31 శాతం మేర కోత పడింది. హార్వర్డ్‌లో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయికి చేరిన తరుణంలోనే భారతీయుల అడ్మిషన్లు తగ్గడం ప్రాధాన్యత సంతరించుకుంది (Indian admissions drop Harvard).

జాతీయ మీడియా కథనాల ప్రకారం, 2025 ఫాల్ సీజన్‌లో 6,749 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందగా వీరిలో అంతర్జాతీయ విద్యార్థుల వాటా 28 శాతంగా ఉంది. 2002 తరువాత అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఈస్థాయిలో ఉండటం ఇదే తొలిసారి. ఇంటర్నేషనల్ విద్యార్థుల సంఖ్యలో స్వల్ప పెరుగుదలే నమోదయినా ప్రస్తుత పరిస్థితుల్లో దీన్నో అద్భుతంగా చూడాలని నిపుణులు చెబుతున్నారు. యూనివర్సిటీకి ప్రభుత్వ నిధుల్లో కోత, వీసా ఆంక్షలు, కోర్టు కేసుల నడుమ ఇంటర్నేషనల్ విద్యార్థుల సంఖ్యలో స్వల్ప స్థాయి పెరుగుదలను కూడా గొప్ప విషయంగా భావించాలన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫాల్ సీజన్‌లో హార్వర్డ్ మొత్తం 545 మంది భారతీయ విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చింది. హార్వర్డ్‌కు చెందిన గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో అత్యధికంగా 107 మంది భారతీయులకు అడ్మిషన్ పొందారు.


భారతీయుల అడ్మిషన్లు తగ్గినప్పటికీ చైనీయుల అడ్మిషన్లు మాత్రం పెరిగాయి. 2025 ఫాల్‌ సీజన్‌లో మొత్తం 1452 మంది చైనా విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. అంతకుముందు ఇదే కాలంతో పోలిస్తే ఇది 4.5 శాతం మేర అధికం. ఇక అమెరికా వ్యాప్తంగా చూస్తే అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య 1 శాతం మేర తగ్గింది.

అమెరికాలో ఉన్నతవిద్యపై ఫోకస్ పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత హార్వర్డ్ యూనివర్సిటీని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. క్యాంపస్‌లో యూదు వ్యతిరేకత పెరుగుతోందని మండిపడ్డారు. నిధుల విడుదలను ఆపు చేశారు. అయితే, కోర్టులు జోక్యం చేసుకోవడంతో హార్వర్డ్ యూనివర్సిటీకి ఊరట దక్కింది.


ఇవీ చదవండి:

భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఇరాన్ మంత్రి ఫోన్ కాల్

ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అప్రమత్తం.. కీలక నిర్ణయం

Updated Date - Jan 15 , 2026 | 03:48 PM