Share News

Al Udeid Air Base Alert: ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అప్రమత్తం.. కీలక నిర్ణయం

ABN , Publish Date - Jan 14 , 2026 | 10:35 PM

ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఖతర్‌లోని వైమానిక స్థావరంలో విధులు నిర్వర్తిస్తున్న కొందరు కీలక సైనిక అధికారులను వెనక్కు రావాలని కోరింది.

Al Udeid Air Base Alert: ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అప్రమత్తం.. కీలక నిర్ణయం
US Iran Tensions

ఇంటర్నెట్ డెస్క్: తమ పొరుగు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై అవసరమైతే దాడి చేస్తామంటూ ఇరాన్ హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఖతర్‌లోని అల్ ఉదైద్ అమెరికా వైమానిక స్థావరంలోని కొందరు అధికారులను అగ్రరాజ్యం వెనక్కు రమ్మని పిలిచినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి. ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకారులపై దాడులు జరిగితే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా దీటుగా బదులిచ్చింది. అమెరికా దాడులు మొదలైన పక్షంలో తామూ పొరుగు దేశాల్లోని అగ్రరాజ్య సైనిక స్థావరాలపై దాడి చేస్తామని తేల్చి చెప్పింది.


ఇక ఖతర్‌ వైమానిక స్థావరాన్ని ఎంత మంది అమెరికా అధికారులు వీడుతున్నారనేది అగ్రరాజ్యం వెల్లడించలేదు. బుధవారం సాయంత్రానికల్లా అల్ ఉదైద్ ఎయిర్‌ బేస్‌ను వీడాలని మాత్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాలపై ఖతర్ కూడా స్పందించింది. ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొంది.

మరోవైపు, దౌత్య మార్గాల్లో కూడా ఇరాన్ తన వంతు ప్రయత్నాలను చేస్తోంది. ఇరాన్ సుప్రీమ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధిపతి ఇటీవలే ఖతర్ విదేశాంగ శాఖ మంత్రితో చర్చలు జరిపారు. తుర్కియే, యూఏఈ మంత్రులతో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సంప్రదింపులు జరిపారు.

ఖతర్‌లోని అల్ ఉదైద్ ఎయిర్‌‌బేస్‌లో వేల మంది అమెరికా దళాలు ఉన్నాయి. తమ అణు స్థావరాలపై గతేడాది జరిగిన అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ అల్ ఉదైద్ ఎయిర్‌ బేస్‌ను టార్గెట్ చేసింది.


ఇవీ చదవండి:

భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఇరాన్ మంత్రి ఫోన్ కాల్

అమెరికాకు ఇరాన్ హెచ్చరిక! మాపై దాడి జరిగితే..

Updated Date - Jan 14 , 2026 | 10:41 PM