Iran Dials India: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఇరాన్ మంత్రి ఫోన్ కాల్
ABN , Publish Date - Jan 14 , 2026 | 09:45 PM
ఇరాన్‌లో పరిస్థితులు అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఇరాన్ మంత్రి కాల్ చేశారు. అక్కడి తాజా పరిస్థితుల గురించి వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ భారత మంత్రి జైశంకర్‌కు తాజాగా ఫోన్ చేశారు. ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి వివరించారు. ఇరాన్ మంత్రితో మాట్లాడిన విషయాన్ని కేంద్ర మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇరాన్‌లో తాజా పరిణామాలపై చర్చించామని తెలిపారు. ఇరాన్‌ను వీడాలంటూ అక్కడి ఇండియన్ ఎంబసీ భారతీయులకు సూచించిన నేపథ్యంలో ఇరాన్ మంత్రి ఫోన్ చేయడం గమనార్హం (Iran Minister Phone Call to Indian Minister Jaishankar).
ఇరాన్‌ను వీడాలంటూ అక్కడి ఇండియన్ ఎంబసీ భారతీయులను అలర్ట్ చేసింది. అందుబాటులో ఉన్న ప్రయాణసాధనాలను వినియోగించుకుని దేశాన్ని వీడాలని సూచించింది. అత్యవసర సందర్భాల్లో తమను సంప్రదించాలంటూ పలు ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీని కూడా షేర్ చేసింది. ఘర్షణలు పెల్లుబుకుతున్న ప్రాంతాలకు వెళ్లొద్దని చెప్పింది. తాజా పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు స్థానిక మీడియాలో వచ్చే వార్తలను గమనిస్తుండాలని కూడా సూచించింది.
ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ స్టూడెంట్ అసోసియేషన్ కూడా స్పందించింది. ఇరాన్‌లోని కశ్మీరీ స్టూడెంట్స్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు సాయపడాలని ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌లకు విజ్ఞప్తి చేసింది. అక్కడి పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇక ఇరాన్ అధినేత ఖమేనీకి వ్యతిరేకంగా పెల్లుబుకుతున్న నిరసనలు ఇప్పటికే హింసాత్మకంగా మారాయి. పోలీసు దళాలతో జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకూ 2500 మంది మరణించారు. ఇక నిరసనకారులకు మద్దతుగా రంగంలోకి దిగుతామన్న అమెరికా అధ్యక్షుడి హెచ్చరికలకు ఇరాన్ ఘాటుగా బదులిచ్చింది. తన పొరుగు దేశాలను హెచ్చరించింది. ఆయా దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
ఇవీ చదవండి:
అమెరికాకు ఇరాన్ హెచ్చరిక! మాపై దాడి జరిగితే..
మస్క్‌కు షాక్.. గ్రోక్‌పై ఇండోనేషియాలో తాత్కాలిక నిషేధం