Iran Warns USA: అమెరికాకు ఇరాన్ హెచ్చరిక! మాపై దాడి జరిగితే..
ABN , Publish Date - Jan 11 , 2026 | 08:55 PM
నిరసనకారులకు మద్దతుగా రంగంలోకి దిగుతామన్న అమెరికాకు ఇరాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. మధ్య ప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌ను కూడా టార్గెట్ చేసుకుంటామని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌లో ప్రజలు కదనుతొక్కుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనల్లో పలువురు ఇప్పటికే మరణించారు. సామాన్యులపై తూటా పేలితే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని అమెరికా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పార్లమెంటు వేదికగా స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ కలీబాఫ్ అగ్రరాజ్యానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా దాడులకు దిగితే తామూ ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఇజ్రాయెల్‌ను కూడా టార్గెట్ చేసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా చట్టసభ సభ్యులు అమెరికా వ్యతిరేక నినాదాలతో పార్లమెంటును హోరెత్తించారు (Iran Warns USA of Retaliation).
ఇక నిరసనకారులకు కూడా పార్లమెంటు స్పీకర్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని అత్యంత కఠిన రీతిలో శిక్షిస్తామని అన్నారు. ఇరాన్ భద్రతా దళాలపై కూడా ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. నిరసనలను దీటుగా ఎదుర్కొంటున్నారని కితాబునిచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్‌లను నిలువరించేందుకు తామే ముందస్తుగా దాడులకు దిగొచ్చన్న సంకేతాలను కూడా ఇచ్చారు.
ఇరాన్ ప్రజలకు మద్దతుగా అమెరికా దాడులు చేయొచ్చన్న అంచనాల నడుమ ఇప్పటికే ఇజ్రాయెల్ హై అలర్ట్‌లో ఉంది. ఇరాన్‌పై దాడి విషయంలో సాధ్యాసాధ్యాలపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూతో శనివారం చర్చించారు.
ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ పడిపోయి జీవన వ్యయాలు పెరగడంతో నిరసనలు మొదలైన విషయం తెలిసిందే. రెండు వారాల క్రితం మొదలైన నిరసనలు ప్రస్తుతం పతాకస్థాయికి చేరుకున్నాయి. టెహ్రాన్, మష్హాద్, కెర్మాన్, తదితర నగరాలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి. నిరసనకారులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. భద్రతా దళాల దాడుల్లో ఇప్పటివరకూ 116 మంది మరణించినట్టు తెలుస్తోంది. మరో 2600 మంది జైలుపాలయ్యారు.
ఇవీ చదవండి:
క్యూబాకు ట్రంప్ వార్నింగ్! ఆ కాలం ముగిసింది.. వెంటనే మాతో డీల్ కుదుర్చుకోండి
మస్క్‌కు షాక్.. గ్రోక్‌పై ఇండోనేషియాలో తాత్కాలిక నిషేధం