Trump Warns Cuba: క్యూబాకు ట్రంప్ వార్నింగ్! ఆ కాలం ముగిసింది.. వెంటనే మాతో డీల్ కుదుర్చుకోండి
ABN , Publish Date - Jan 11 , 2026 | 07:57 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వెనెజువెలా నుంచి ఇకపై ఒక్కపైసా కూడా రాదని తేల్చి చెప్పారు. ఆలస్యం కాకమునుపే తమతో డీల్ కుదుర్చుకోవాలని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలా మిత్రదేశం క్యూబాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం వార్నింగ్ ఇచ్చారు. వెనెజువెలా నుంచి ఇకపై క్యూబాకు పైసా కూడా అందదన్నారు. వెనెజువెలా ముడి చమురు చుక్క కూడా చేరదని తేల్చి చెప్పారు. ఇకపై క్యూబా ఒప్పందాలు అమెరికాతోనేనని కూడా అన్నారు. ఆలస్యం కాకమునుపే తమతో డీల్ కుదుర్చుకోవాలని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ హెచ్చరించారు (Donald Trump Warns Cuba).
ఇప్పటివరకూ వెనెజువెలా నుంచి ముడిచమురు, డబ్బు క్యూబాకు చేరాయని ట్రంప్ చెప్పారు. ఇందుకు బదులుగా వెనెజువెలా నియంతలకు క్యూబా భద్రతను కల్పించిందని అన్నారు. ఇకపై ఇలాంటివి సాగవని చెప్పారు. వెనెజువెలా ప్రజలకు ఇకపై అమెరికా అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. క్రిమినల్స్, వసూళ్లకు పాల్పడే వారి రక్షణ వెనెజువెలాకు అవసరం లేదని అన్నారు. కాబట్టి, చేతులు కాలక ముందే క్యూబా మేల్కొని అమెరికాతో డీల్ కుదుర్చుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆంక్షలను తట్టుకునేందుకు క్యూబా, వెనెజువెలాలు ఇప్పటివరకూ కలిసి నడిచాయి. అయితే, మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవడం, వెనెజువెలా వ్యవహారాలన్నీ ఇకపై తమ కనుసన్నల్లోనే అని చెప్పడంతో క్యూబాకు చిక్కులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలకు మరింత ప్రాధాన్యం పెరిగింది.
వెనెజువెలా నిధులకు రక్షణగా..
అమెరికా అకౌంట్స్‌లోని వెనెజువెలా ముడిచమురు నిధులకు రక్షణగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. కోర్టు కేసులు, ఇతర చర్యల ద్వారా ఈ నిధులను దారి మళ్లించకుండా ఆదేశాలు జారీ చేశారు. ఈ నిధులకు రక్షణ కల్పించడం వెనెజువెలా స్థిరత్వానికి, అమెరికా విదేశాంగ విధానానికి కీలకమని పేర్కొన్నారు. తమ ముడి చమురు అమ్మకాల ద్వారా వచ్చే రాబడిపై పూర్తి హక్కులు వెనెజువెలావే! అయితే, భద్రతా కారణాల రీత్యా నిధులను అమెరికా ట్రెజరీ అకౌంట్స్‌లో పెట్టారు.
ఇవీ చదవండి:
మస్క్‌కు షాక్.. గ్రోక్‌పై ఇండోనేషియాలో తాత్కాలిక నిషేధం
మరో చమురు రవాణా నౌకను స్వాధీనం చేసుకున్నాం: అమెరికా