Share News

Grok Blocked In Indonesia: మస్క్‌కు షాక్.. గ్రోక్‌పై ఇండోనేషియాలో తాత్కాలిక నిషేధం

ABN , Publish Date - Jan 10 , 2026 | 07:06 PM

ఎక్స్‌ఏఐ సంస్థకు చెందిన గ్రోక్ చాట్‌బాట్‌పై ఇండోనేషియా ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Grok Blocked In Indonesia: మస్క్‌కు షాక్.. గ్రోక్‌పై ఇండోనేషియాలో తాత్కాలిక నిషేధం
Indonesia Blocks Grok

ఇంటర్నెట్ డెస్క్: ఇండోనేషియా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలాన్ మస్క్ సారథ్యంలోని ఎక్స్‌‌ఏఐ సంస్థకు చెందిన గ్రోక్‌ చాట్‌బాట్‌‌పై తాత్కాలిక నిషేధం విధించింది. వేల మంది యూజర్లు గ్రోక్‌తో అసభ్య డీప్ ఫేక్ చిత్రాలు రూపొందిస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గ్రోక్‌పై నిషేధం విధించిన తొలి దేశంగా నిలిచింది.

మహిళలు, చిన్నారుల డీప్ ఫేక్ చిత్రాలు రూపొందిస్తున్నట్టు తమ దృష్టికి రావడంతో గ్రోక్‌పై తాత్కాలిక నిషేధం విధించామని ఇండోనేషియా కమ్యూనికేషన్స్, డిజిటల్ వ్యవహారాల శాఖ మంత్రి పేర్కొన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గ్రోక్‌తో అసభ్య చిత్రాల రూపకల్పనను మంత్రి డిజిటల్ హింసగా అభివర్ణించారు. ఇప్పటికే ఎక్స్ అధికారులకు ఇండోనేషియా ప్రభుత్వం సమన్లు కూడా జారీ చేసింది. గ్రోక్‌తో చెడు ప్రభావాలు పెరుగుతున్న వైనంపై వివరణ కోరింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎలాంటి పటిష్ఠమైన సాంకేతిక చర్యలు తీసుకుంటారో చెప్పాలని కూడా ఇండోనేషియా ప్రభుత్వం కోరినట్టు సమాచారం. స్థానిక చట్టాలకు కట్టుబడటంపైనే ఇండోనేషియాలో గ్రోక్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కూడా మంత్రి పేర్కొన్నారు.


మస్క్ వార్నింగ్!

గ్రోక్‌ను దుర్వినియోగ పరచవద్దని ఎలాన్ మస్క్‌తో పాటు గ్రోక్ మాతృసంస్థ ఎక్స్ఏఐ ఇటీవలే హెచ్చరించింది. ఇలా చేసేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. డీప్ ఫేక్‌ల బెడద తీవ్రమై విమర్శలు పెరగడంతో మస్క్ మరో వివరణ ఇచ్చారు. డీప్ ఫేక్ చిత్రాలు సృష్టిస్తున్న యూజర్లకు బదులు ఎక్స్‌ను నిందించడం సరికాదని అన్నారు. ఎలాన్ మస్క్ సారథ్యంలోని కృత్రిమ మేధ సంస్థ ఎక్స్ఏఐ.. గ్రోక్ చాట్ బాట్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఎక్స్‌లో ఈ చాట్‌బాట్ నేరుగా యూజర్లకు అందుబాటులో ఉంది.


ఇవీ చదవండి:

మరో చమురు రవాణా నౌకను స్వాధీనం చేసుకున్నాం: అమెరికా

ట్రంప్‌‌నకు షాక్.. అమెరికా తీరును ఎండగట్టిన వెనెజువెలా అధ్యక్షురాలు

Updated Date - Jan 10 , 2026 | 07:26 PM