Olina Oil Tanker Seize: మరో చమురు రవాణా నౌకను స్వాధీనం చేసుకున్నాం: అమెరికా
ABN , Publish Date - Jan 09 , 2026 | 10:12 PM
వెనెజువెలా నుంచి అక్రమంగా ముడిచమురును తరలిస్తున్న మరో ఆయిల్ ట్యాంకర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అమెరికా సైన్యం తాజాగా పేర్కొంది. కరీబియన్ సముద్ర జలాల్లో నౌకను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలా నుంచి బయలుదేరిన మరో చమురు రవాణా నౌకను (ఆయిల్ ట్యాంకర్) శుక్రవారం స్వాధీనం చేసుకున్నామని అమెరికా సైన్యం తాజాగా పేర్కొంది. తెల్లవారుజామున యూఎస్ మెరీన్స్ అనే ప్రత్యేకదళం, నేవీ సిబ్బంది కలిసి ఒలీనా పేరు గల ఈ నౌకను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించింది. వెనెజువెలా ముడి చమురు రవాణాపై అమెరికా నిర్బంధం విధించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై యూఎస్ దక్షిణ కమాండ్ స్పందిస్తూ క్రిమినల్స్ తమ నుంచి తప్పించుకోలేరని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా అధికారులు నెట్టింట షేర్ చేశారు (Venezuela Oil Tanker Seized).
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, జనవరి 3న ఒలీనా వెనెజువెలా నుంచి బయలుదేరింది. అప్పటికే అమెరికా ఆంక్షలు మొదలు కావడంతో నౌక తిరుగుప్రయాణమైంది. ఈ క్రమంలోనే అమెరికా దళాలు నౌకను అదుపులోకి తీసుకున్నాయి. అమెరికా ఆంక్షలను ఉల్లంఘిస్తూ చమురు రవాణా చేసే నౌకల్లో ఒలీనా కూడా ఒకటని అమెరికా పేర్కొంది.
వెనెజువెలా వ్యవహారాలు అమెరికా చేతుల్లోకి వెళ్లిన నాటి నుంచీ ఇప్పటివరకూ ఐదు ఆయిల్ ట్యాంకర్‌లు అగ్రరాజ్యానికి చిక్కాయి. ఇటీవల రష్యా జెండాతో వెళుతున్న ఓ ఆయిల్ ట్యాంకర్‌ను కూడా అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నౌకలో ముగ్గురు భారతీయులు ఉన్నట్టు కూడా అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అదే రోజున ఎమ్/టీ సోఫియా అనే ఆయిల్ ట్యాంకర్‌ను కూడా అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై అమెరికా ఈ ఆయిల్ ట్యాంకర్స్‌ను అదుపులోకి తీసుకుంది.
ఇవీ చదవండి:
ట్రంప్‌నకు షాక్.. అమెరికా తీరును ఎండగట్టిన వెనెజువెలా అధ్యక్షురాలు
ఇరాన్‌లో దారుణం.. పట్టపగలు పోలీసు అధికారి హత్య