Venezuela on US Greed: ట్రంప్‌నకు షాక్.. అమెరికా తీరును ఎండగట్టిన వెనెజువెలా అధ్యక్షురాలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 10:23 PM
వెనెజువెలా ఆపద్ధర్మ అధ్యక్షురాలు డెల్సీ రోడ్రీగెజ్ అమెరికా తీరును ఎండగట్టారు. దురాశతో అమెరికా తమ దేశ వనరులపై దృష్టి సారించిందని పార్లమెంటును ఉద్దేశించి తాజాగా వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలా వ్యవహారాలన్నీ ఇకపై తన కనుసన్నల్లోనే సాగుతాయని పదే పదే చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అప్పుడే ఎదురుగాలులు మొదలయ్యాయి. ఇటీవలే వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా అరెస్టు చేసి తమ దేశానికి తరలించుకుపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆపద్ధర్మ అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రీగెజ్ బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆమె పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ అమెరికా తీరును ఎండగట్టారు.
శక్తివనరులకు వెనెజువెలా కేంద్రంగా మారిందని అధ్యక్షురాలు డెల్సీ అన్నారు. ఇది చివరకు సమస్యలను తెచ్చి పెట్టిందని వ్యాఖ్యానించారు. దేశానికి ఉత్తరాన ఉన్న వారు దురాశా పూరితులై, వెనెజువెలా వనరులను దక్కించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
అమెరికాతో ఎలాంటి ఏకపక్ష ఒప్పందం ఉండదని వెనెజువెలా అధ్యక్షురాలు పేర్కొన్నారు. అన్ని పక్షాలకూ లాభం చేకూర్చే భాగస్వామ్యాలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని కూడా చెప్పారు. పరస్పర అంగీకారానికి సంబంధించిన అంశాలు ఒప్పందాల్లో స్పష్టంగా ఉండాలని కూడా చెప్పుకొచ్చారు. ఇక మదురో హయాంలో డ్రగ్స్ అక్రమ రవాణా, మానవహక్కుల ఉల్లంఘనలు జరిగాయన్న అమెరికా ఆరోపణలను కూడా అవాస్తవాలంటూ కొట్టిపారేశారు. అయితే, అమెరికాతో వాణిజ్యాన్ని కొనసాగించడాన్ని సమర్థించుకున్నారు. ఇదేమీ అసాధారణం కాదని అన్నారు.
వెనెజువెలా ప్రభుత్వం తమకు పూర్తిగా సహకరిస్తోందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తరుణంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వెనెజువెలా ముడి చమురు వనరులు కొంత కాలం పాటు అమెరికా ఆధీనంలోనే ఉంటాయని అన్నారు. అమెరికాకు కావాల్సినవి వెనెజువెలా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని కూడా చెప్పారు.
ఇవీ చదవండి:
అమెరికాకు చిక్కిన ముడి చమురు రవాణా నౌకలో భారతీయులు! అంతర్జాతీయ మీడియాలో కథనాలు
అమెరికాకు చిక్కిన ముడి చమురు రవాణా నౌకలో భారతీయులు! అంతర్జాతీయ మీడియాలో కథనాలు