Indians In Russia Oil Tanker: అమెరికాకు చిక్కిన ముడి చమురు రవాణా నౌకలో భారతీయులు! అంతర్జాతీయ మీడియాలో కథనాలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 09:51 PM
రష్యా జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్ నౌక ఇటీవల అమెరికాకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే, ఈ నౌకలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: అట్లాంటిక్ మహాసముద్రంలో ఇటీవల అమెరికా సైనిక దళాలు స్వాధీనం చేసుకున్న ముడి చమురు నౌకలో ముగ్గురు భారతీయులు ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. రష్యా జెండాతో వెళుతున్న మ్యారినెరా అనే ఆయిల్ ట్యాంకర్ నౌకను బుధవారం అమెరికా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నట్టు రష్యా టుడే సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. బెల్లా 1 అనే పేరుతో జర్నీ ప్రారంభించిన నౌక ఆ తరువాత రష్యా జెండాతో మ్యారినేరా పేరుతో ముందుకు సాగుతున్న తరుణంలో అమెరికా దళాలకు చిక్కింది (Indians In Russia Flagged Oil Tanker caught by US).
మీడియా కథనాల ప్రకారం, నౌక సిబ్బందిలో 17 మంది ఉక్రేనియన్లు, ఆరుగురు జార్జియా దేశస్థులు, ముగ్గురు భారత జాతీయులు, రష్యాకు చెందిన ఇద్దరు ఉన్నారు. నౌక కెప్టెన్ రష్యాకు చెందిన వ్యక్తేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వారందరూ అమెరికా ఆధీనంలోనే ఉన్నారు. సిబ్బందిని ఎప్పటికి విడిచిపెడతారనే విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. నౌక యజమాని ఎవరు, నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయా? లేదా? అనే విషయాన్ని తేల్చేందుకు అమెరికా అధికారులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు.
కొన్ని వారాలుగా నౌకను వెంబడిస్తున్న అమెరికా దళాలు నిన్న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో దాన్ని అదుపులోకి తీసుకున్నాయి. ఇందుకు బ్రిటన్ ప్రభుత్వ సహకారం కూడా ఉన్నట్టు అమెరికా వెల్లడించింది. అయితే, నౌకపై రష్యా జెండా ఉండటంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. రష్యా తీవ్ర స్థాయిలో స్పందించింది. ఇతర దేశాల పరిధిలో రిజిస్టరైన నౌకలను స్వాధీనం చేసుకునే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని రష్యా రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది. నౌకలోని సిబ్బందితో హుందాగా, గౌరవంగా నడుచుకోవాలని కూడా రష్యా కోరింది. విదేశీయులందరినీ వీలైనంత త్వరగా విడుదల చేయాలని తేల్చి చెప్పింది.
ఇవీ చదవండి:
ఇరాన్‌లో దారుణం.. పట్టపగలు పోలీసు అధికారి హత్య
బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి హత్య.. నిందితుల అరెస్టు