Share News

Iran Police Shot Dead: ఇరాన్‌లో దారుణం.. పట్టపగలు పోలీసు అధికారి హత్య

ABN , Publish Date - Jan 08 , 2026 | 08:07 PM

ఇరాన్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఓ పోలీసు అధికారిని అసాల్ట్ రైఫిల్‌తో కాల్చి హత్య చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Iran Police Shot Dead: ఇరాన్‌లో దారుణం.. పట్టపగలు పోలీసు అధికారి హత్య
Iran Cop Shot Dead

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు నానాటికీ తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఇటీవల అక్కడ పలువురు పోలీసులు హింసాత్మక ఘటనలకు బలయ్యారు. బుధవారం ఓ పోలీసును గుర్తు తెలియని వ్యక్తి అసాల్ట్ రైఫిల్‌తో కాల్చి చంపారు. నిందితులు తమ కారులోంచే ఈ దారుణ ఘటనను చిత్రీకరించారు. సిస్టాన్ అండ్ బలుచిస్థాన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది (Iran Cop Shot Dead Viral Video).

వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఒక గుర్తు తెలియని వ్యక్తి తన కారులోంచి తుపాకీని బయటపెట్టి మరో వాహనంలోని పోలీసుపై కాల్పులు జరిపాడు. పలు రౌండ్లు కాల్చడంతో క్రమంగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. మృతుడిని అధికారులు మహమ్మద్ హగీఘాట్‌గా గుర్తించారు. సిస్టాన్ అండ్ బలుచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఇరాన్‌షహర్ భద్రతా దళాల్లో అతడు విధులు నిర్వర్తించేవాడని తెలిపారు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.


ఇక మంగళవారం జరిగిన మరో ఘటనలో ఎహ్సాన్ అఘాజానీ అనే పోలీసు అధికారి హత్యకు గురయ్యారు. ఇల్లామ్ ప్రావిన్స్‌లోని మాలెక్‌షాహీ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో అతడిపై కాల్పులు జరిగాయని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని స్థానిక అధికారులు తెలిపారు.

ఇరాన్‌లో ఆర్థికవ్యవస్థ పతనం అవుతుండటంతో ప్రజలు నిరసన బాటపడుతున్న విషయం తెలిసిందే. శతాబ్దాల చరిత్ర కలిగిన గ్రాండ్ బాజార్‌లో గత నెలలో నిరసనలు మొదలయ్యాయి. క్రమంగా దేశమంతా విస్తరించాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ కరెన్సీ విలువ నానాటికీ పడిపోతుండటం, ధరలు మిన్నంటడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. ప్రభుత్వం తమ రాజకీయ, సామాజిక హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు పలికారు. నిరసకారులపై తూటా పేలితే తాము రంగంలోకి దిగుతామని ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


ఇవీ చదవండి:

బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి హత్య.. నిందితుల అరెస్టు

ట్రంప్ ప్రభుత్వాన్ని హేళన చేస్తూ మదురో డ్యాన్స్.. జీవితం తలకిందులు

Updated Date - Jan 08 , 2026 | 08:33 PM