Maduro No War Dance: ట్రంప్ ప్రభుత్వాన్ని హేళన చేస్తూ మదురో డ్యాన్స్.. జీవితం తలకిందులు
ABN , Publish Date - Jan 05 , 2026 | 07:21 PM
అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయకుండా ప్రజల ముందుకు పదే పదే వస్తూ మదురో ట్రంప్ సర్కారును సవాలు చేశారట. ఇదే చివరకు అమెరికాను సైనిక చర్యకు ఉసిగొల్పిందని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి. మదురో చేసిన ఓ డ్యాన్స్ వీడియోనే మొత్తం వ్యవహారాన్ని మలుపు తిప్పిందని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుని సొంత దేశానికి తరలించిన వైనం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అసలు పరిస్థితి ఒక్కసారిగా ఇలా ఎలా దిగజారిందని సామాన్యులు చర్చించుకుంటున్నారు. అయితే, గద్దె దిగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ ప్రభుత్వం మదురోను చాలా కాలం నుంచే హెచ్చరిస్తోంది. యుద్ధం తప్పదని వార్నింగ్ కూడా ఇచ్చిందట. ఈ హెచ్చరికలను బేఖాతరు చేయడంతో పాటు పదే పదే బహిరంగ కార్యక్రమాలకు హాజరవుతూ మదురో అమెరికాకు సవాలు విసిరారని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు తమ హెచ్చరికలను హేళన చేస్తున్నట్టు మదురో ఓ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో వెనెజువెలా టీవీ ఛానళ్లల్లో ప్రసారం కావడంతో ట్రంప్ ప్రభుత్వానికి సహనం నశించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో, పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి మదురో జీవితం తలకిందులు అయిపోయిందని చెప్పాయి (Maduro No War Dance Video Triggered Trump Govt).
వైరల్‌గా మారిన ఆ వీడియోలో మదురో ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అమెరికా యుద్ధ హెచ్చరికలను పరోక్షంగా ప్రస్తావించారు. యుద్ధం వద్దంటూ రాసిన లిరిక్స్‌కు స్టెప్పులేస్తూ కనిపించారు. ఈ వీడియో వెనెజువెలా టీవీ ఛానళ్లల్లో కొంతకాలం క్రితం ప్రముఖంగా ప్రసారమైంది. వెనెజువెలాపై యుద్ధం తప్పదని అప్పటికే ట్రంప్ ప్రభుత్వం ఘాటు హెచ్చరికలు చేసింది. ఈ హెచ్చరికలను హేళన చేస్తున్నట్టు మదురో డ్యాన్స్ వీడియో రిలీజ్ కావడంతో ట్రంప్ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం కలిగించిందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.
ట్రంప్ ప్రభుత్వం తనను ఏమీ చేయలేదనే సందేశం మదురో ఈ డ్యాన్స్ ద్వారా పంపించారని ప్రభుత్వ పెద్దల్లో కొంతమంది భావించారు. ఇదే చివరకు పరిస్థితులను ఊహించని మలుపు తిప్పింది. అధ్యక్ష పదవికి రాజీనామా చేసి టర్కీకి తరలిపోవాలని అమెరికా ప్రభుత్వం అంతకుమునుపు చాలాసార్లు మదురోకు సూచించిందట. ఈ ప్రతిపాదనను తిరస్కరించడమే కాకుండా మదురో పదే పదే బహిరంగ సమావేశాలు, సభలకు హాజరవుతూ ట్రంప్ ప్రభుత్వాన్ని లెక్క చేసేదే లేదన్నట్టు ప్రవర్తించారట. దీంతో, అగ్రరాజ్యానికి తిక్క రేగి సైన్యాన్ని రంగంలోకి దింపిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికాకు మాదకద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తూ నార్కో-టెర్రరిజానికి పాల్పడిన ఆరోపణలపై ట్రంప్ సర్కారు మదురోను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ నివాసంపై దాడి
నికిత మర్డర్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు