Elon Musk - Venezuela: వెనెజువెలాకు మస్క్ బంపర్ ఆఫర్.. ఫిబ్రవరి 3 వరకూ..
ABN , Publish Date - Jan 04 , 2026 | 09:24 PM
సంక్షోభంలో కూరుకుపోయిన వెనెజువెలాకు మద్దతుగా ఎలాన్ మస్క్ రంగంలోకి దిగారు. అక్కడి ప్రజలకు ఫిబ్రవరి 3వ తేదీ వరకూ స్టార్‌లింక్ ద్వారా ఉచిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తామని తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వెనెజువెలాకు టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. అక్కడి ప్రజలకు ఫిబ్రవరి 3 వరకూ స్టార్ లింక్ ద్వారా ఉచిత బ్రాడ్ బ్రాండ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తామని తెలిపారు. ప్రజలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఉచిత ఇంటర్నెట్ సేవల గురించి తొలుత స్టార్‌లింక్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ ట్వీట్‌ను మస్క్ రీట్వీట్ చేశారు. ‘ప్రజలకు మద్దతుగా..’ అని కామెంట్ చేశారు (Free Starlink Broadband Service for Venezuela).
ఇదిలా ఉంటే.. మదురోకు ఎలాన్ మస్క్ రెండేళ్ల క్రితం ఇచ్చిన ఓ వార్నింగ్ పోస్టు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘నేను వస్తున్నా. నిన్ను గాడిదపై కూర్చోబెట్టి జైలుకు తీసుకెళతా’ అని మస్క్ అప్పట్లో పోస్టు పెట్టారు. దేశంలో మస్క్‌ను కాలుపెట్టనివ్వొద్దంటూ భద్రతా దళాలకు మదురో అప్పట్లో ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మస్క్ ఈ మేరకు పోస్టు పెట్టారు. నాటి వార్నింగ్ నేటికి నిజం కావడంతో ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే మదురోను అధికారం నుంచి తప్పించేందుకు ట్రంప్ ప్రభుత్వం తొలి పర్యాయంలోనే భద్రతా దళాలు ప్రయత్నించాయి. ట్రంప్ కూడా అప్పట్లో ఆసక్తి కనబరిచినా ఆ తరువాత వెనక్కు తగ్గారు. ఇక రెండో పర్యాయం మాత్రం మదురోను అరెస్టు చేసి అమెరికాకు తీసుకొచ్చారు. మరోవైపు, వెనెజువెలా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు దేశ ఉపాధ్యక్షురాలు అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. ఇక వెనెజువెలా వ్యవహారాలన్నీ అమెరికా కనుసన్నల్లోనే సాగుతాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
జర్మనీలో అగ్నిప్రమాదం.. తప్పించుకునే ప్రయత్నంలో తెలంగాణ విద్యార్థి మృతి
యూఎస్‌లో భారీ ఉగ్రదాడికి టీనేజర్ యత్నం.. భగ్నం చేసిన ఎఫ్‌బీఐ