TG Youth Dies in Germany: జర్మనీలో అగ్నిప్రమాదం.. తప్పించుకునే ప్రయత్నంలో తెలంగాణ విద్యార్థి మృతి
ABN , Publish Date - Jan 02 , 2026 | 07:31 AM
జర్మనీలో జరిగిన ఓ ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి చెందారు. తానుఉంటున్న భనవం కింది అంతస్తులో చెలరేగిన మంటల నుంచి తప్పించుకునే క్రమంలో తీవ్ర గాయాలపాలై కన్నుమూశారు. మృతుడిని జనగామ జిల్లాకు చెందిన హృతిక్ రెడ్డిగా గుర్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: జర్మనీలో ఉంటున్న ఓ తెలంగాణ విద్యార్థి అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తీవ్ర గాయాలపాలై కన్నుమూశారు. మృతుడిని జనగామ జిల్లా, చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన హృతిక్ రెడ్డి(25)గా గుర్తించారు (TG Student Dies in Germany).
సంపత్ రెడ్డి, కరుణ దంపతుల కుమారుడు హృతిక్ రెడ్డి పైచదువుల కోసం 2023లో జర్మనీకి వెళ్లారు. మాగ్దబర్గ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లోని నాలుగవ అంతస్తులో ఉంటున్నారు. డిసెంబర్ 30న అతడు ఉంటున్న అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో హృతిక్ రెడ్డి మూడో అంతస్తుకు దిగొచ్చారు. అప్పటికే మంటలు, దట్టమైన పొగ వ్యాపించాయి. దీంతో, మూడవ అంతస్తు నుంచే హృతిక్ కిందకు దూకేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సంక్రాంతి కోసం హృతిక్ భారత్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యారని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని అతడి ఇంటి పక్కన ఉండే మరో హైదరాబాదీ వ్యక్తి తెలిపారు.
ఈ ప్రమాదం గురించి తొలుత ఆయన తన కుటుంబసభ్యులకు తెలియజేయగా వారు హృతిక్ కుటుంబానికి సమాచారం అందించారు. అనుమతులు లేకున్నా బాణసంచా కాల్చడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. హృతిక్ మరణంతో అతడి కుటుంబం శోకసంద్రంలో కూరుకుపోయింది. భారత్‌కు వచ్చేందుకు హృతిక్ టిక్కెట్ కూడా బుక్ చేసుకున్నాడని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హృతిక్ మృతదేహాన్ని భారత్‌కు తరలించడంలో సాయపడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే, చట్టవ్యతిరేకంగా బాణసంచా కలిగి ఉన్న సుమారు 400 మందిని బుధవారం బెర్లిన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ బాణసంచ కాల్చిన ఘటనల్లో నగరంలో పలు భవనాలు దెబ్బతిన్నాయి.
ఇవీ చదవండి..
నెబ్రాస్కా తెలుగు సమితి కొత్త చరిత్ర...యువజన సదస్సు సూపర్ సక్సెస్
టి.సి.ఎఫ్ ఆధ్వర్యంలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు
For More NRI News And Telugu News