TCF Christmas Celebrations: టి.సి.ఎఫ్ ఆధ్వర్యంలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు
ABN , Publish Date - Dec 28 , 2025 | 10:39 AM
ఖతర్‌లోని తెలుగు క్రైస్తవ సహవాసము (టి.సి.ఎఫ్) శుక్రవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఎడారిలోనూ గలగల ప్రవహించే గోదావరి తీరంలోని చర్చిల్లో పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించాయి.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కరుణామయుడు, ప్రేమ స్వరూపుడు ఏసు క్రీస్తు జన్మదినోత్సవం క్రైస్తవంలో పర్వదినం. గల్ఫ్ దేశాలలో ఈ పర్వ దినాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించడంలో భారతీయ క్రైస్తవులలో తెలుగునాట ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన విశ్వాసులు అగ్రగణ్యులు (TCF Christmas Celebrations).

గల్ఫ్ దేశాలలో క్రిస్మస్ వచ్చిందంటే చాలు అక్కడి ప్రతి తెలుగు చర్చి.. నరసపురం, భీమవరం లేదా పాలకొల్లులోని చర్చిల తరహాలో ముస్తాబవుతుంది. ఈ క్రమంలో ఖతర్‌లోని తెలుగు క్రైస్తవ సహవాసము (టి.సి.యఫ్) శుక్రవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఎడారిలోనూ గలగల ప్రవహించే గోదావరి తీరంలోని చర్చిల్లో పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించాయి. పాస్టర్ బిషప్ బొల్లబ్బాయి భక్తులను ఉద్దేశించి వాక్యోపదేశం చేశారు. ఏసు ప్రభువు విశ్వానికి మార్గం చూపే లోక రక్షకుడని, ఏసు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. నరసాపురం నుండి ప్రత్యేకంగా వచ్చిన రెవరండ్ బెజవాడ ఆశపు బైబిల్‌ను వివరించారు. దైనందిన జీవితంలో అందరూ కలిసి మెలిసి ఉండాలనేదే ప్రభువు లక్ష్యం అని ఆయన అన్నారు.

గ్యాస్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న ఖతర్‌లోని తెలుగు క్రైస్తవులలో కూడా అపార భక్తి, ష్కల విశ్వాసం ఉండగా వారికి తెలుగు భాషలో బైబిలు బోధించేందుకు టి.సి.యఫ్ నిరంతరం కృషి చేస్తోంది. ప్రత్యేకించి అంతంత మాత్రం అక్షరాస్యత కల్గి ఉండి స్థానిక అరబ్బుల ఇళ్ళలో పాచి పనులు చేసే ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన క్రైస్తవ మహిళల పట్ల ప్రత్యేక దృష్టితో టి.సి.యఫ్ పని చేస్తోంది. దీనికి తగినట్లుగా క్రిస్మస్ వేడుకలలో ఈ పేద మహిళలందరూ పెద్ద సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. సంవత్సరానికి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేసే పేదలు అనేక మంది ఉన్నారని, ఈ రకమైన అభాగ్యులకు క్రిస్మస్ నిస్సందేహంగా సంతోషకరమైన రోజని టి.సి.యఫ్ కోశాధికారి వర్జీల్ బాబు వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి
సాటా సెంట్రల్ క్రిస్మస్ వేడుకలు
ఖతర్‌లోని క్రీస్తు సైనికుల సహవాసం చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు