Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి హత్య.. నిందితుల అరెస్టు
ABN , Publish Date - Jan 04 , 2026 | 10:05 PM
బంగ్లాదేశ్‌లో హిందూవ్యాపారి హత్య కేసులో స్థానిక పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి ఖాకోన్ చంద్రదాస్‌ను హత్య చేసిన నిందితులను అక్కడి పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. నిందితులను సొహాగ్ ఖాన్(27), రబ్బీ మొల్లా (21), పలాశ్ సర్దార్‌గా (25) గుర్తించారు. కిషోర్‌గంజ్ జిల్లాలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన నిందితులను అదుపులోకి తీసుకున్నామని ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ అధికారులు తెలిపారు.
నిందితులకు చేర చరిత్ర ఉందని బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. డ్రగ్స్, క్రిమినల్ కార్యకలాపాలకు సంబంధించి వారిపై గతంలో పలు కేసులు నమోదైనట్టు తెలిపారు. అయితే, చంద్రదాస్‌పై వారి దాడి వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ దాడిలో ఇతరులు ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా చంద్రదాస్‌ను కొందరు దారుణంగా పొడిచి నిప్పు పెట్టారు. అతడు తన ఫార్మసీ షాపును మూసేసి రాత్రి 9.30 గంటలకు ఇంటికి వస్తుండగా ఈ దారుణం జరిగింది. అతడిపై పదునైన ఆయుధాలతో దాడి చేసి ఆపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పారిపోయారు. వెంటనే చంద్రదాస్ ఆర్తనాదాలు చేస్తూ సమీపంలోని చెరువులోకి దూకి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇది విని వెంటనే స్పందించిన స్థానికులు అతడికి ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన అతడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధితుడికి 30 శాతం కాలిన గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. ముఖంతో పాటు శరీరంపై ఇతర చోట్ల తీవ్ర కత్తిపోట్లు ఉన్నాయని కూడా చెప్పారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రదాస్ కుటుంబం డిమాండ్ చేసింది.
ఇవీ చదవండి:
వెనెజువెలాకు మస్క్ బంపర్ ఆఫర్.. ఫిబ్రవరి 3 వరకూ..
యూఎస్‌లో భారీ ఉగ్రదాడికి టీనేజర్ యత్నం.. భగ్నం చేసిన ఎఫ్‌బీఐ