కేరళలోనూ వివాదం.. ప్రసంగంలో కొన్ని పేరాలు చదవని గవర్నర్..
ABN , Publish Date - Jan 20 , 2026 | 02:59 PM
కేరళ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజే శాసన సభలో వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశ ప్రారంభ ప్రసంగంలో గవర్నర్ ఆర్వీ.అర్లేకర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలోని పలు అంశాలను చదవక పోవడంపై కేరళ సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: కేరళ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. అయితే.. తొలి రోజే శాసనసభలో వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్(Rajendra Vishwanath Arlekar) ప్రసంగించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం కాపీలోని పలు అంశాలను చదవకపోవడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రిమండలి ఆమోదించిన ప్రసంగం కాపీలోని రెండు భాగాలను గవర్నర్ చదవకుండా వదిలేశారని సీఎం పినరయి విజయన్(Pinarayi Vijayan) పేర్కొన్నారు. అర్లేకర్ సభ నుంచి వెళ్లిన తర్వాత సీఎం ప్రసంగిస్తూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రసంగం కాపీలో 12వ పేరా ప్రారంభ అంశాలను, 15వ పేరా ముగింపు అంశాలను గవర్నర్ చదవలేదని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు సీఎం.
ఇదే సమయంలో.. శాసన సభ స్పీకర్ ఏఎన్.షంసీర్ కూడా కీలక విషయాన్ని వెల్లడించారు. నిబంధనల ప్రకారం.. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విధాన ప్రసంగాన్నే అధికారికంగా భావిస్తామని పేర్కొన్నారు. కొన్ని అంశాలను వదిలేస్తూ.. గవర్నర్ (Governor Arlekar) చేసిన ప్రసంగాన్ని అధికారికంగా గుర్తించబోమని స్పీకర్ స్పష్టం చేశారు.
కాగా.. తమిళనాడు శాసనసభ సమావేశంలోనూ అక్కడి గవర్నర్ ఆర్ఎన్.రవి ప్రసంగం మధ్యలోనే అసెంబ్లీ నుంచి వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. గవర్నర్.. సభలో రాష్ట్ర గీతం అనంతరం జాతీయ గీతం వినిపించాలని కోరారు. అందుకు స్పీకర్ తిరు ఎం.అప్పవు నిరాకరించారు. తమిళనాడు అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం రాష్ట్ర గీతం ఆలపించి, సభ ముగింపులో జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ఈ విషయంలో గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..
ఏపీలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి