Tamil Nadu Assembly: జాతీయ గీతం ఆలపించలేదని.. అసెంబ్లీ నుంచి తమిళనాడు గవర్నర్ వాకౌట్..
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:25 PM
తమిళనాడు అసెంబ్లీలో మంగళవారం హైడ్రామా చోటు చేసుకుంది. గవర్నర్ ఆర్.ఎన్.రవి తన ప్రసంగాన్ని చదవకుండా మధ్యలోనే వాకౌట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీలో మంగళవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ఆర్.ఎన్.రవి, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రభుత్వం మధ్య జాతీయ గీతం విషయంలో మరోసారి వివాదం చెలరేగింది. గవర్నర్ తన ప్రసంగాన్ని చదవకుండా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఈ ఏడాది అసెంబ్లీ తొలి సమావేశం సందర్భంగా గవర్నర్ రవి సభలో రాష్ట్ర గీతం అనంతరం జాతీయ గీతం వినిపించాలని కోరారు. అందుకు స్పీకర్ తిరు ఎం.అప్పవు నిరాకరించారు. తమిళనాడు సంప్రదాయం ప్రకారం రాష్ట్ర గీతం ఆలపించి, సభ ముగింపులో జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ఈ విషయంలో గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.
తమిళనాడు అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై లోక్ భవన్(గవర్నర్ కార్యాలయం) అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. అసెంబ్లీ నుంచి గవర్నర్ రవి బయటకు రావడంపై వివరణ ఇచ్చింది. గవర్నర్.. ప్రధానంగా జాతీయ గీతం విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. రాజ్యంగ మర్యాదల ప్రకారం.. సభ ప్రారంభం, ముగింపులో జాతీయ గీతాన్ని ఆలపించాలని గవర్నర్ గతంలోనూ సూచించారు. కానీ, ప్రభుత్వం రాష్ట్ర గీతం మాత్రమే ఆలపించి, జాతీయ గీతాన్ని విస్మరించిందని లోక్ భవన్ పేర్కొంది. ప్రభుత్వం గవర్నర్‌కు ఇచ్చిన కాపీలో అసత్య, నిరాధారమైన ప్రకటనలు ఉన్నాయని.. అందుకే వాటికి ప్రసంగించేందుకు గవర్నర్ నిరాకరించారంది. రాష్ట్రంలో దళితులపై జరుగుతోన్న దారుణాలు, మహిళలపై లైంగిక హింస వంటి సమస్యలు తీవ్రమవుతుంటే వాటి గురించి ప్రసంగ కాపీలో ఎక్కడా ప్రస్తావించలేదని పేర్కొంది. సభను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతున్నపుడు ఆయన మైక్‌ను పదే పదే స్విచ్ఆఫ్ చేసి అడ్డుకున్నారని చెప్పింది. సభలో స్పీకర్ వ్యవహారంచిన తీరు గౌరవప్రదంగా లేదని అందుకే గవర్నర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారని ఆరోపించింది.
గవర్నర్ రవి తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ స్పందించారు. గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేయడం కేవలం ఆయన వ్యక్తిగత విషయం కాదు, అది తమిళనాడు ప్రజలను, రాజ్యాంగ వ్యవస్థను అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గవర్నర్ అంటే ఒక రాష్ట్ర ప్రథమ పౌరుడు. అలాంటి వ్యక్తి ఇలా వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం' అని అన్నారు. మంత్రి మండలి ఆమోదించిన ప్రసంగాన్ని గవర్నర్ చదవడం రాజ్యాంగ విధి అని.. అందులో ఆయన సొంత అభిప్రాయాలు కలపడం రాజ్యాంగ విరుద్ధమని స్టాలిన్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి.
భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..
ఏపీలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి
Read Latest Telangana News and National News