200 శాతం సుంకం విధిస్తా.. ట్రంప్ మరో హెచ్చరిక
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:49 PM
గాజాలో శాంతి స్థాపన దిశగా తనకు సహకరించకపోతే ఫ్రాన్స్‌పై 200 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ త్వరలో ఎన్నికల్లో ఓడిపోతారని కూడా జోస్యం చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: గాజాలో శాంతి స్థాపనకు మార్గాలపై అమెరికా, ఫ్రాన్స్‌ల మధ్య విభేదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. శాంతిస్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో చేరేందుకు ఫ్రాన్స్ సుముఖంగా లేదు. ఈ క్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్‌పై మండిపడుతున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఫ్రాన్స్ ఉత్పత్తులపై ఏకంగా 200 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు. సోమవారం సాయంత్రం పత్రికా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు (Trump Threatens with 200 percent Tariffs on France).
బోర్డ్ ఆఫ్ పీస్ కూటమిలో చేరేందుకు తాము రెడీగా లేమన్న ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటన గురించి విలేకరులు ప్రశ్నించారు. దీంతో, ట్రంప్ తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. ‘అవునా.. అలా అన్నారా? అయినా, ఆయన ఎవ్వరికీ అవసరం లేదు. నేను ఫ్రెంచ్ మద్యం, షాంపేన్స్‌పై 200 శాతం సుంకం విధిస్తాను. అప్పుడు ఆయనే దార్లోకి వస్తాడు’ అని అన్నారు.
అంతకుముందు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రైవేటుగా పంపించిన మెసేజీలను కూడా ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు. సిరియా విషయంలో అమెరికాతో ఏకీభవిస్తున్నట్టు మాక్రాన్ చెప్పిన సందేశాలను పంచుకున్నారు.
కాగా, బోర్డు ఆఫ్ పీస్‌లో చేరాలంటూ అమెరికా పంపించిన ఆహ్వానాన్ని తాము తిరస్కరించనున్నట్టు ఫ్రాన్స్ వర్గాలు ధ్రువీకరించాయి. ట్రంప్ ప్రతిపాదిత కార్యక్రమం లక్ష్యాలు గాజాకే పరిమితం కాలేదని పేర్కొన్నాయి. ఐక్యరాజ్య సమితి, ఆ సంస్థ సిద్ధాంతాల పరిధిలోకి చొచ్చుకొచ్చాయని అభిప్రాయపడ్డాయి. ఇక బహుళ ధ్రువ ప్రపంచానికి పునాది ఐక్యరాజ్య సమితి అని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ కూడా తేల్చి చెప్పింది.
ఇదిచాలదన్నట్టు ట్రంప్ హెచ్చరికలకు కొన్ని గంటల ముందే ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ఓ సెటైరికల్ పోస్టును పెట్టింది. గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవాలన్న ట్రంప్ మొండిపట్టును ఎద్దేవా చేసింది. రష్యాతో ముప్పు ఎదురు కాకమునుపే గ్రీన్‌లాండ్‌కు అమెరికా భద్రత కల్పించాలని అమెరికా ట్రెజరీ స్కాట్ బెన్సన్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ఘాటు రిప్లై ఇచ్చింది. అగ్నిప్రమాదం జరగకముందే..ఇల్లు తగలబెట్టుకున్న రీతిలో ఆ ప్రతిపాదనలు ఉన్నాయని హేళన చేసింది.
ఇవీ చదవండి:
ట్రంప్ మమల్ని నట్టేట ముంచేశారు.. ఇరాన్‌లో జనాగ్రహం
ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు