Iranians Feel Betrayed: ట్రంప్ మమల్ని నట్టేట ముంచేశారు.. ఇరాన్‌లో జనాగ్రహం
ABN , Publish Date - Jan 18 , 2026 | 01:41 PM
ఇరాన్‌లో అమెరికా సైన్యం కాలుపెడుతుందని నమ్మిన అనేక మంది ఇరానియన్లు ప్రస్తుతం తాము మోసపోయామని బాధపడుతున్నారు. తమను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నట్టేట ముంచారని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ పాలకులకు వ్యతిరేకంగా గళమెత్తిన వేల మంది ఇరాన్ ప్రజలు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమను మోసం చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌లో ప్రభుత్వ మార్పుపై గంపెడాశ పెట్టుకున్న వారు ట్రంప్ తాజా ప్రకటనతో తాము నిస్సహాయులుగా మిగిలిపోయామని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు (Iranians Feel Betrayed by Trump).
తమను అణచివేస్తున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఇరానియన్లు కొంతకాలంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. వీరందరికీ తాను మద్దతుగా ఉంటానని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. వారిపై ఈగ వాలితే తాను రంగంలోకి దిగుతానని ఇరాన్ పాలకులను హెచ్చరించారు. దీంతో, ఉద్యమకారులు రెట్టించిన ఉత్సాహంతో తమ నిరసనలను కొనసాగించారు. త్వరలో సాయం అందుతుందన్న ట్రంప్ ప్రకటనతో ప్రాణాలకు తెగించి మరీ ప్రభుత్వ దళాలకు ఎదురు నిలిచారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినా కూడా, ఏదోక రోజు అమెరికా సైన్యం రంగంలోకి దిగి ఖమేనీ నుంచి తమకు విముక్తి కలిగిస్తుందన్న ఆశతో ఉద్యమాన్ని కొనసాగించారు.
మరోవైపు, ఇరాన్ ప్రభుత్వం మాత్రం నిరసనలపై ఉక్కుపాదం మోపింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. భారీ స్థాయిలో భద్రతా దళాలను మోహరించి నిరసనలను కర్కశంగా అణచివేసింది. ఈ క్రమంలో స్నైపర్లు, మెషీన్ గన్స్‌తో కూడా ప్రభుత్వ దళాలు దాడులు జరిపాయన్న వార్తలు కలకలం రేపాయి. నిరసనకారులు మాత్రం వెనక్కు తగ్గలేదు. ప్రాణాలకు తెగించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కారు.
ఇంతలో ట్రంప్ నుంచి ఊహించని ప్రకటన రావడంతో వారంతా హతాశులైపోయారు. నిరసనకారులపై ప్రతీకారం తీర్చుకోబోమని తనకు ఇరాన్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ ప్రజలు కోరుకుంటున్నట్టు అమెరికా సైన్యం రంగంలోకి దిగదని పరోక్ష సంకేతాన్ని ఇచ్చారు. ఈ ప్రకటన ఇరాన్ జనాలకు శరాఘాతంగా మారింది. అమెరికాను నమ్ముకుని ప్రాణాలకు తెగించి చివరకు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయామని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘ఈ ఘర్షణల్లో 15 వేల మంది సమిధలయ్యారు. ఇందుకు ట్రంప్‌యే బాధ్యుడు. తాము సిద్ధంగా ఉన్నామన్న ట్రంప్ ప్రకటన చూసి వేల మంది నిరసన బాటపట్టారు. అమెరికా ప్రభుత్వం ఇరాన్ పాలకులతో ఏదో ఒప్పందం చేసుకున్నాకే మమ్మల్ని ఇలా మోసం చేసింది. ట్రంప్ ప్రకటన మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తమను పిచ్చోళ్లను చేసి, వాడుకుని వదిలేశారని అనేక మంది భావిస్తున్నారు. దారుణంగా మోసపోయామని ఆవేదన చెందుతున్నారు’ అని టెహ్రాన్‌కు చెందిన ఓ వ్యాపారి పేర్కొన్నారు.
కొందరు మాత్రం ట్రంప్ చర్యలను సమర్థించారు. ఇరాన్ ప్రభుత్వంపై పైచేయి సాధించేందుకే అమెరికా ఇలా వ్యూహాత్మకంగా వెనకడుగు వేసిందని అంటున్నారు. అయితే, ప్రస్తుతానికి మాత్రం నిరసనలకు అనుకోని బ్రేక్ పడిందని, మునుపటి ఊపు భవిష్యత్తులో మళ్లీ చూస్తామో లేదో తెలియదని నిర్వేదం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:
ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు
భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఇరాన్ మంత్రి ఫోన్ కాల్