India US Trade Deal: రేపటి నుంచి భారత్-అమెరికా వాణిజ్య చర్చలు, యూఎస్‌కు కేంద్రమంత్రి
ABN , Publish Date - Sep 21 , 2025 | 03:17 PM
భారత్, అమెరికా మధ్య ఆలస్యమవుతున్న వాణిజ్య ఒప్పందం చర్చలు రేపటి నుంచి ముందుకు సాగనున్నాయి. ట్రంప్ చర్యల కారణంగా అమెరికాకు భారత్ చేసే ఎగుమతులు 8.01 నుంచి 6.86 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. సెప్టెంబర్ నుంచి టారిఫ్‌ల పూర్తి ప్రభావం కనిపిస్తుందని..
ఇంటర్నెట్ డెస్క్: భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ రేపటి (సెప్టెంబర్ 22) నుంచి అమెరికాలో పర్యటించబోతున్నారు. దీర్ఘకాలంగా ఇరుదేశాల మధ్య(India US Trade Deal) ఆలస్యమవుతున్న వాణిజ్య ఒప్పందం చర్చలను ముందుకు నడిపించనున్నారు. ఇటీవలి ఇరు దేశాల చర్చల్లో పురోగతి సాధించిన తర్వాత ఈ పర్యటన జరుగుతోంది. భారత ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ పర్యటన ద్వారా రెండు దేశాలకు మేలు చేసే వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది.
కాగా, గత వారం అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ బ్రెండన్ లించ్ నేతృత్వంలోని యూఎస్ డెలిగేషన్, భారత చీఫ్ నెగోషియేటర్ రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని భారత అధికారులతో న్యూఢిల్లీలో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ చర్చలను సానుకూల, ముందుచూపు చర్చలుగా భారత్ అభివర్ణించింది. అయితే, ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన హెచ్1బి వీసా ఫీజులపై హైక్, రష్యన్ ఆయిల్ కొనుగోళ్ల (Russian Oil Imports)ను తగ్గించాలని.. భారత ఫార్మ్ , డైరీ మార్కెట్లను అమెరికా కంపెనీలకు తెరవాలని లాంటి అంశాలు చర్చకు వస్తాయో లేదో స్పష్టం కాలేదు.
ఇటీవల కొంత కాలంగా భారత-అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump Trade Policies) శుక్రవారం హెచ్1బి వీసాకు సంవత్సరానికి లక్ష డాలర్ల ఫీజు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇది భారత ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీపై ప్రభావం చూపుతుందని భారత్ తెలిపింది. అలాగే, రష్యన్ ఆయిల్ కొనుగోళ్లపై భారత్‌పై 25శాతం జరిమానా టారిఫ్ విధించి, మొత్తం టారిఫ్‌లను 50శాతానికి పెంచారు. ఆగస్టు 25-29 మధ్య న్యూఢిల్లీకి వచ్చేందుకు ప్లాన్ చేసిన అమెరికా డెలిగేషన్ చర్చలు ఆగిపోవడంతో రద్దైంది.
ఇదిలా ఉండగా ట్రేడ్ డేటా ప్రకారం, ఆగస్టులో భారత్, అమెరికాకు చేసిన ఎగుమతులు 6.86 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇవి జులైలో 8.01 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సెప్టెంబర్ నుంచి టారిఫ్‌ల పూర్తి ప్రభావం కనిపిస్తుందని ఎగుమతిదారులు(US Tariffs on India) హెచ్చరిస్తున్నారు. ఇక రేపటినుంచి జరుగబోతున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పర్యటన ద్వారా భారత, అమెరికా వాణిజ్య ఒప్పందం వైపు మరో అడుగుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి