Share News

Middle East conflict: యుద్ధానికి ముందు ప్రశాంతతేనా?

ABN , Publish Date - Jan 18 , 2026 | 03:35 AM

ఇరాన్‌పై దాడిని అమెరికా తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రభుత్వ పాశవిక అణచివేతతో ఇరాన్‌లో ఆందోళనలూ తగ్గాయి. కానీ పరిస్థితి మాత్రం తుఫాను ముందు ప్రశాంతతలానే కనిపిస్తోంది...

Middle East conflict: యుద్ధానికి ముందు ప్రశాంతతేనా?

  • ఇరాన్‌లో తగ్గిన ఆందోళనలు

  • సైనిక చర్యను వాయిదా వేసిన ట్రంప్‌

  • కానీ, దాడికి సిద్ధమనే సంకేతాలు

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌, జనవరి 17: ఇరాన్‌పై దాడిని అమెరికా తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రభుత్వ పాశవిక అణచివేతతో ఇరాన్‌లో ఆందోళనలూ తగ్గాయి. కానీ పరిస్థితి మాత్రం తుఫాను ముందు ప్రశాంతతలానే కనిపిస్తోంది. అమెరికా, ఇరాన్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒక క్రిమినల్‌ అంటూ ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మండిపడ్డారు. దేశద్రోహుల వెన్నువిరుస్తామని ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్‌ ప్రోద్బలంతో ఉగ్రవాదులు వేలాది మంది ఇరాన్‌ ప్రజలను చంపారని ఆరోపించారు. మరోవైపు ఇరాన్‌పై దాడికి సిద్ధంగానే ఉన్నామని ఐరాస భద్రతా మండలి భేటీలో అమెరికా రాయబారి పేర్కొన్నారు. అమెరికా సైనిక చర్య మొదలుపెడితే.. ఇరాన్‌ సమీపంలో ఉన్న ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు చేసే అవకాశం ఉందని, వాటిని ఎదుర్కొనేలా సన్నద్ధమయ్యేందుకు కాస్త సమయం తీసుకోవాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, గల్ఫ్‌ ప్రతినిధులు ట్రంప్‌ను కోరినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొసాద్‌ చీఫ్‌ డేవిడ్‌ అమెరికాకు చేరుకుని ట్రంప్‌ యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతానికి సైనిక చర్యను ట్రంప్‌ పక్కనపెట్టారని, ఏ క్షణమైనా విరుచుకుపడే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. ఇరాన్‌లో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంతో సాధారణ ప్రజలెవరూ బయటికి రావడం లేదు. ఇరాన్‌ ఆందోళనల్లో మరణాలు 3,428కి చేరాయని నార్వేకు చెందిన ‘ఇరాన్‌ హ్యూమన్‌ రైట్స్‌’ సంస్థ శనివారం వెల్లడించింది. కాగా, అగ్రరాజ్యాల అణచివేతకు గురైన ప్రపంచానికి స్పూర్తిగా ఇరాన్‌ నిలిచే ఉంటుందని, ఇరాన్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని హెజ్బొల్లా సంస్థ ప్రకటించింది.

ఆందోళనలు ఉధృతం చేయండి: పహ్లావీ

ఇరాన్‌లో ఆందోళనలు ఉధృతం కావడానికి కారణమైన ఆ దేశ మాజీ యువరాజు రెజా పహ్లావీ మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా మూకుమ్మడిగా బయటికి వచ్చి పోరాడాలని, మతవాద ప్రభుత్వాన్ని గద్దెదింపాలని పేర్కొన్నారు. ఇరాన్‌ ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారని, అంతర్జాతీయ సమాజం వారికి మద్దతుగా నిలవాలని కోరారు. ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌ నుంచి పలువురు భారతీయులు శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఇంటర్నెట్‌, టెలికం సేవల నిలిపివేతతో అసలేం జరుగుతోందో అర్థంకాలేదని, భయం భయంగా గడిపామని వారు పేర్కొన్నారు.


అసలు క్రిమినల్‌ ట్రంపే: ఖమేనీ

ఇరాన్‌లో ఆందోళనలు, మరణాలు, నష్టాల వెనుక అసలు క్రిమినల్‌ అమెరికా అధ్యక్షుడు ట్రంపేనని ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఖమేనీ మండిపడ్డారు. ఆందోళనకారులపై మరింత కఠినంగా వ్యవహరించాలని అధికారులన ఆదేశించారు. ‘‘దేశాన్ని యుద్ధం వైపు నడిపించాలని మేం కోరుకోవడం లేదు. కానీ విదేశీ శక్తుల ప్రోద్బలంతో ఆందోళనల పేరిట హింసకు పాల్పడ్డ వదిలే ప్రసక్తే లేదు. ఇరాన్‌లో జోక్యం చేసుకున్న అంతర్జాతీయ క్రిమినల్స్‌ కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరు. ఇరాన్‌ నష్టాలకు అమెరికా అధ్యక్షుడే బాధ్యుడు. ఇరాన్‌ను మింగేయాలన్నదే అమెరికా లక్ష్యం’’ అని ఖమేనీ అన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 03:35 AM