Trump Announces Tariffs on NATO Allies: నాటో దేశాలపై..ట్రంప్ సుంకాల బాంబు!
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:31 AM
గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా పరిధిలోకి తెచ్చుకునే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న 8 యూరోపియన్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కత్తిగట్టారు
వాషింగ్టన్/కోపెన్‌హాగెన్, జనవరి 17: గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా పరిధిలోకి తెచ్చుకునే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న 8 యూరోపియన్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కత్తిగట్టారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలపై 10ు సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. జూన్ 1 నుంచి సుంకాలను 25 శాతానికి పెంచుతానని.. గ్రీన్‌ల్యాండ్ పూర్తిగా అమెరికా ఆధీనంలోకి వచ్చేవరకు ఈ సుంకాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ట్రంప్ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘‘అమెరికా దశాబ్దాలుగా డెన్మార్క్, ఇతర యూరోపియన్ దేశాల నుంచి ఎలాంటి సుంకాలు, ప్రతిఫలం ఆశించకుండా సబ్సిడీలు అందిస్తూ వస్తోంది. డెన్మార్క్ ఇప్పుడు ప్రతిఫలం చెల్లించాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ శాంతి ప్రమాదంలో ఉంది. గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని చైనా, రష్యా ప్రయత్నిస్తున్నాయి. వాటిని ఎదుర్కొనే శక్తి డెన్మార్క్‌కు లేదు. అమెరికాకు మాత్రమే ఆ సామర్థ్యం ఉంది. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, యూకే, నెదర్లాండ్స్, ఫిన్‌లాండ్ దేశాలు తమ దళాలను గ్రీన్‌ల్యాండ్‌కు పంపి.. ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టాయి. ఆ దేశాలు ప్రమాదకరమైన ఆటను మొదలుపెట్టి ప్రపంచ భద్రతను ప్రమాదంలోకి నెట్టాయి. అమెరికా జాతీయ భద్రతకు, గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థ కోసం గ్రీన్‌ల్యాండ్ అత్యవసరం. ఈ అంశంలో చర్చలకు సిద్ధం’’ అని ట్రంప్ పేర్కొన్నారు.