Religious violence: బంగ్లాదేశ్‌లో వాహనంతో ఢీకొట్టి మరో హిందువు హత్య!
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:40 AM
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య జరిగింది. ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తోన్న హిందూ యువకుడు రిపాన్ సాహా....
న్యూఢిల్లీ/ ఢాకా, జనవరి 17: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య జరిగింది. ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తోన్న హిందూ యువకుడు రిపాన్ సాహా(30) పెట్రోల్‌కు డబ్బు చెల్లించకుండా వెళ్లిపోతోన్న వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా.. అతడిని వాహనంతో ఢీకొట్టి వెళ్లిపోయినట్లు బంగ్లా పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్‌లోని రాజ్‌బరి జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆ దేశంలో హిందువులపై జరుగుతోన్న మత పరమైన హింసాకాండలో భాగమేనా.. కాదా.. అన్న విషయం స్పష్టం కాలేదు. దీనిపై హత్య కేసు నమోదు చేస్తున్నట్లు రాజ్‌బరి జిల్లా సదర్ పోలీసు చీఫ్ ఖొండాకర్ జియాఉర్ రహ్మాన్ స్థానిక మీడియాకు తెలిపారు. హతుడు డబ్బు చెల్లించకుండా వెళ్లిపోతోన్న వాహనానికి అడ్డు నిలబడగా.. అతడిని వాహనంతో తొక్కించి నిందితులు పరారయ్యారని ఆయన పేర్కొన్నారు. బాధితుడు అక్కడికక్కడే మరణించాడని తెలిపారు. అనంతరం ఆ వాహనాన్ని గుర్తించి.. సీజ్ చేసి, దాని యజమాని అబుల్ హషీం(55), డ్రైవర్ కమాల్ హొసేన్(43)లను అరెస్టు చేశారు.