భారత్, అమెరికా 'ట్రేడ్ డీల్' వెనుక ఉన్న కీలక వ్యక్తి ఎవరంటే..!
ABN , Publish Date - Feb 03 , 2026 | 02:38 PM
భారత్ విషయంలో సుంకాలను తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడం వెనుక ఓ వ్యక్తి కీలకంగా మారారు. ప్రస్తుతం ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనే భారత్ లోని అమెరికా రాయబారిగా పని చేస్తున్న సెర్గియో గోర్.
ఇంటర్నెట్‌డెస్క్: భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీంతో ఇకపై భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 18 శాతానికి తగ్గాయి. అయితే భారత్ విషయంలో సుంకాలను తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడం వెనుక ఓ వ్యక్తి కీలకంగా మారారు. ప్రస్తుతం ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనే భారత్ లోని అమెరికా రాయబారిగా పని చేస్తున్న సెర్గియో గోర్. ఈ ఏడాది జనవరిలో అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఇరుదేశాల (India-US) మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య బంధాన్ని మరోస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు.
కొంతకాలం క్రితం ట్రంప్ టారిఫ్‌లు, ఆయన చేసిన ప్రకటనలు రెండు దేశాల సంబంధాల్లో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాయబారిగా బాధ్యతలు చేపట్టిన సెర్గియో గోర్.. అతి తక్కువ సమయంలోనే ఇరుదేశాల సంబంధాలను పునర్నిర్మించడంలో కీలకపాత్ర పోషించారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహం వల్లే ఈ ఒప్పందానికి అంగీకారం లభించిందని ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఇప్పటినుంచి రెండు దేశాల మధ్య కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందని అభివర్ణించారు.
సెర్గియో గోర్ ట్రంప్ కు వీర విధేయుడుగా ఉన్నాడు. అందుకే అతి తక్కువ కాలంలోనే ఆయన ట్రంప్ పరిపాలన విభాగంలో స్థానం దక్కించుకున్నారు. అత్యంత వివాదాస్పదమైన వ్యక్తుల్లో సెర్గియో గోర్ (sergio Gor) ఒకరు. గోర్ నియామకంపై భారత్‌లో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ట్రంప్ మాత్రం ‘నా అజెండాను అమలుచేయడానికి నేను నమ్మిన వ్యక్తి నాకు కావాలి. ఆ విషయంలో సెర్గియో గొప్ప రాయబారి అవుతాడు’ అని ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌కు రాయబారిగా నియమితులు కాకముందు వైట్‌హౌస్‌లో పర్సనల్ డైరెక్టర్‌గా గోర్ పనిచేశారు. ట్రంప్ (Donald Trump) రాజకీయ అజెండాకు తగ్గట్టుగా గోర్ విధులు నిర్వహించారు. ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోదీల మధ్య స్నేహబంధం నిజమైందేనని ఇటీవల మీడియా ముందు గోర్ ప్రస్తావించారు.
గోర్ కుటుంబ నేపథ్యం:
గోర్ తల్లిదండ్రులు రష్యా మూలాలు ఉన్నవారు. వారి కుటుంబం 1990ల్లో అమెరికాకు వలస వచ్చింది. అమెరికాకు వచ్చిన కొంతకాలానికే గోర్‌కు పౌరసత్వం లభించింది. 2008లో పొలిటికల్ సైన్స్, అంతర్జాతీయ వ్యవహారాల్లో గోర్ పట్టా పొందారు. తొలినుంచి రిపబ్లికన్ పార్టీతో ఆయన సంబంధాలు కొనసాగించారు. ఈ క్రమంలోనే రిపబ్లికన్ నేషనల్ కమిటీకి కమ్యూనికేషన్ అండ్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పనిచేశారు. 2020లో ట్రంప్ ప్రభుత్వంలో విక్టరీ ఫైనాన్స్ కమిటీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించి..అందరి దృష్టిని ఆకర్షించారు. తర్వాత ఆయన ట్రంప్‌నకు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ‘మేయర్ ఆఫ్ మార్-ఎ-లాగో’గా గోర్ పేరు సంపాదించుకున్నారు. మార్-ఎ-లాగో అనేది ఫ్లోరిడాలోని డొనాల్డ్ ట్రంప్ రిసార్ట్ పేరు.
ఇవి కూడా చదవండి:
హెచ్‌సీఏలో కీలక పరిణామం.. నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్
బాయ్‌కాట్ నష్టం రూ.2200 కోట్లు!