Share News

అంతర్జాతీయ విమానాలపై ఇజ్రాయెల్ సెక్యూరిటీ రివ్యూ

ABN , Publish Date - Oct 05 , 2026 | 07:29 AM

ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఒమన్ కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇజ్రాయెల్‌కు వచ్చే అంతర్జాతీయ విమానాలపై భద్రతా సమీక్షలు నిర్వహించాలని అధికారులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు.

అంతర్జాతీయ విమానాలపై ఇజ్రాయెల్ సెక్యూరిటీ రివ్యూ

ఇంటర్‌నెట్ డెస్క్: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళుతున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఒమన్ కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇజ్రాయెల్‌కు వచ్చే అంతర్జాతీయ విమానాలపై భద్రతా సమీక్షలు నిర్వహించాలని అధికారులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ షుమెల్ బెన్ ఎజ్రాకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.


విదేశాల నుంచి ఇజ్రాయెల్‌కు ప్రయాణించే విమానాలపై భద్రతా వ్యవహారాలను చూసేందుకు ఒక ఎగ్జామినర్‌ను నియమించాలని ఆయన సూచించారు. విదేశాల విమానయాన శాఖలను పూర్తిగా పరిశీలించాలన్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. కాగా.. ఫ్లైదుబాయ్ ఉదంతం నేపథ్యంలో ఆ ఘటనపై దర్యాప్తు చేయాలని కోరుతూ డిమాండ్లు వెల్లువెత్తాయి. కోపైలట్ హమ్మామీ ఆ విమానాన్ని కూల్చేందుకు యత్నించాడని ఇజ్రాయెల్ మీడియా కథనాలు ప్రచురించింది. అలాగే, తమ దేశంతో దౌత్యపరమైన సంబంధాలులేని దేశానికి చెందిన ఓ కోపైలట్‌ను ఆ విమానంలోకి ఎలా అనుమతించారని విమర్శకులు, ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు వచ్చే అంతర్జాతీయ విమానాలపై భద్రతా సమీక్షలు నిర్వహించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


అది నిఘా సంస్థలు చూసుకోవాలి

ఫ్లైదుబాయ్ విమానంలో భద్రతా వైఫల్యాన్ని ఇజ్రాయెల్ రవాణా శాఖ మంత్రి మిరి రెజెవ్ తిరస్కరించారు. విదేశాల నుంచి వచ్చే విమానాలకు సంబంధించిన భద్రతను నిఘా సంస్థలు మొసాద్, షిన్ బెట్ చూసుకోవాలని ఆయన చెప్పారు. కాగా.. ఇజ్రాయెల్‌లో కొనసాగుతున్న విదేశాల విమానయాన సంస్థల భద్రతకు సంబంధించి స్పష్టమైన బాధ్యతా విభజన జరగలేదని 2024 నాటి కాగ్ రిపోర్టు తెలిపింది. అలాగే, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఉన్న దేశాల నుంచి గత కొన్నేళ్లలో పైలట్లు.. ఇజ్రాయెల్‌కు విమానాలు నడిపారని మీడియా పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

యుద్ధ విరమణ కోసం భారత్‌ చేసిన ప్రతిపాదనలు బాగున్నాయి

రష్యా డ్రోన్‌ దాడి.. ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌ ధ్వంసం

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 05 , 2026 | 07:54 AM