చివరి వరకూ పోరాడాలని నిశ్చయించుకున్నా: కెప్టెన్ స్మిత్ మచ్చార్
ABN , Publish Date - Oct 19 , 2026 | 04:05 PM
ఫ్లైదుబాయ్ విమానంలో తనపై ఒమనీ కోపైలట్ దాడి చేసిన తర్వాత విమానాన్ని ఇజ్రాయెల్ పౌరుడు, ప్లంబర్ యానివ్ హయూన్ ల్యాండ్ చేసినట్లు తెలిసి ఆశ్చర్యపోయానని ఫ్లైదుబాయ్ విమానం హీరో, భారత పైలట్ కెప్టెన్ మచ్చార్ అన్నారు. అబుదాబిలోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. స్కై న్యూస్ అరేబియా, ద నేషనల్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్ విమానంలో తనపై ఒమనీ కోపైలట్ దాడి చేసిన తర్వాత విమానాన్ని ఇజ్రాయెల్ పౌరుడు, ప్లంబర్ యానివ్ హయూన్ ల్యాండ్ చేసినట్లు తెలిసి ఆశ్చర్యపోయానని ఫ్లైదుబాయ్ విమానం హీరో, భారత పైలట్ కెప్టెన్ మచ్చార్ అన్నారు. అబుధాబిలోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. స్కై న్యూస్ అరేబియా, ద నేషనల్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆరోజు విమానంలో తనపై జరిగిన భయానక దాడుల గురించి పంచుకున్నారు. తాను చికిత్స పొందుతున్న బెడ్‌పై నుంచే మచ్చార్ మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన క్లిప్పింగ్‌ను ఆ మీడియా సంస్థలు ‘ఎక్స్’ లో షేర్ చేశాయి.
తనకు, తన కుటుంబానికి యూఏఈ ప్రభుత్వం, ప్రజలు ఇస్తున్న మద్దతుకు చలించిపోయానని మచ్చార్ తెలిపారు. అంతేకాకుండా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ తనను ఆసుపత్రిలో కలిశారని, తర్వాత తన ఇంటికి కూడా ఫోన్ చేశారని, ఈ విషయాన్ని అధ్యక్షుడే తెలిపారని భావోద్వేగానికి గురయ్యారు. తన ఇంటికి కాల్ చేశానని అధ్యక్షుడు చెప్పిన తర్వాత మొదటిసారిగా తాను నవ్వానని తెలిపారు. తనపైనా, తన కుటుంబంపైనా అధ్యక్షుడు, ప్రజలు చూపుతున్న ఆదరణకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నానని వెల్లడించారు.
కోపైలట్ దాడి చేస్తాడని ఊహించలేదు
ఎప్పట్లాగే ఆరోజు(సెప్టెంబర్ 30) విమానం ఎక్కి విధుల్లో పాల్గొన్నానని మచ్చార్ తెలిపారు. ‘నేను, కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ రెండు గంటల పాటు కాక్‌పిట్‌లో కలిసి ప్రయాణించాం. అంతవరకూ అంతా సవ్యంగానే సాగింది. ఒక్కసారిగా నా తలపై వెనుక నుంచి ఏదో బలంగా తగిలింది. కాక్‌పిట్ ప్యానెల్ నుంచి ఏదో వస్తువు నా తలపై పడిందని అనుకున్నాను. మూడో దెబ్బ తగిలాక నాపై దాడి జరిగిందని గ్రహించాను. అదేపనిగా దాడి జరుగుతూ ఉండడంతో ముందుగా సీట్ బెల్ట్ విప్పాలని చూశాను. కోపైలట్ దాడులను అడ్డుకోవడానికి అన్ని రకాలా ప్రయత్నించాను. అదే సమయంలో కాక్‌పిట్ కెమెరా ద్వారా ఇంకో పైలట్‌ను చూసి సహోద్యోగులను అలర్ట్ చేయాల్సిన అవసరం ఉందనిపించింది. ఇంకోవైపు నాపై కోపైలట్ దెబ్బల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. టీంలో ఉండాల్సిన వ్యక్తే నాపై దాడి చేస్తున్నాడని తెలుసుకున్నాను’ అని మచార్ వివరించారు.
ఎలాగోలా అడ్డుకున్నా
కోపైలట్ దాడులను ఎలాగోలా అడ్డుకొని విమానంలో ఉన్న ప్రయాణికులను కాపాడాలనుకున్నానని మచ్చార్ తెలిపారు. ముందుగా కాక్‌పిట్ డోర్ ఓపెన్ చేసేందుకు డోర్ నాబ్‌పై చేయిపెట్టానని చెప్పారు. సహోద్యోగుల కోసం కేకలు వేస్తూ కాక్‌పిట్‌లోనే పడిపోయానని వెల్లడించారు. మళ్లీ లేచి చివరకు డోర్ తెరిచానని పేర్కొన్నారు. ‘ఆ టైంలో నాకు అత్యంత భయంకరంగా అనిపించిందేమంటే, విమానం ఇంజిన్లలో పవర్ లేదని విన్నాను. దీంతో విమానం తలకిందులుగా పడిపోతోంది. మరోవైపు విమాన సిబ్బంది, ప్రయాణికులు కాక్‌పిట్ తలుపు తడుతున్నారు. ఇక బతకడం కష్టమనిపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోకూడదు. విమానంలోని ప్రయాణికులను కాపాడాలని దృఢంగా నిశ్చయించుకున్నా. ఆ టైంలో కాక్‌పిట్ తలుపు కోసం చూస్తున్నా. చివరకు తలుపు తెరిచా. దేవుడి దయవల్ల డోర్ ఓపెన్ అయింది’ అని మచార్ వివరించారు. ఆ టైంలో ఎట్టిపరిస్థితుల్లోనూ చనిపోకూడదు అనుకున్నానని ఆయన చెప్పారు. మళ్లీ విమానం నడిపేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నానని మచ్చార్ తెలిపారు.
ఈ వార్తలూ చదవండి
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన.. బయటకొచ్చిన నిందితుల ఫొటో