రూ.190 కోట్ల విలువైన వస్తువుల దోపిడీ.. 13 మంది నిందితుల అరెస్ట్
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:36 PM
అమెరికాలో భారీగా రైళ్ల దోపిడీకి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సరకు రవాణా రైళ్లను లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు.. ఏకంగా 22.5 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దోచుకున్నారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు.
లాస్ ఏంజెలెస్, నవంబర్ 20: అమెరికాలో భారీగా రైళ్ల దోపిడీకి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కాలిఫోర్నియాలో సరకు రవాణా రైళ్లను లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు.. ఏకంగా 22.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.190 కోట్లకు పైగా) విలువైన వస్తువులను దోచుకున్నారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో 21 ఏళ్ల నాథన్ డేనియల్ ఏంజెల్ ప్రధాన నిందితుడు కాగా.. అతడి తండ్రి డేనియల్ ఏంజెల్, ఇద్దరు మామలు రోడోల్ఫో ఏంజెల్, జోస్ లూయిస్ ఏంజెల్ కూడా నిందితుల జాబితాలో ఉన్నారు.
అమెరికా న్యాయశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితులు 2024 ఫిబ్రవరి నుంచి 2026 ఆగస్టు మధ్య దోపిడీలు చేశారు. నైక్ షూస్, మిల్వాకీ టూల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళ్తున్న రైళ్లను లక్ష్యంగా చేసుకునేవారు. ముందుగా రైళ్ల రాకపోకలను గమనించి, అనువైన ప్రాంతాల్లో వాటిని ఆపేందుకు కుట్ర పన్నేవారు. అనంతరం రైళ్లలోకి ప్రవేశించి ఎయిర్ హోస్‌లను కత్తిరించి అత్యవసరంగా ఆగిపోయేలా చేసేవారు. ఆ తర్వాత కంటైనర్లలోకి చొరబడి వస్తువులను దొంగిలించి, ముందుగా సిద్ధం చేసుకున్న ట్రక్కులు, వ్యాన్లలో తరలించేవారు. దొంగిలించిన వస్తువులను నిందితులు రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసి, బ్లాక్ మార్కెట్లో విక్రయించేవారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ గ్రూప్ చాట్స్ ద్వారా సమాచారాన్ని పంచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దోపిడీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలనూ పరస్పరం పంపించుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆ వీడియోను విడుదల చేశారు.
కాగా, రూ.190 కోట్ల విలువైన వస్తువుల చోరీకి సంబంధించి మొత్తం 14 మందిపై ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ అభియోగాలు నమోదు చేసింది. నిందితులపై రైల్వే సరకు దొంగతనం, దొంగిలించిన వస్తువుల స్వాధీనం, కుట్ర వంటి అభియోగాలు ఉన్నాయి. వారిలో 13 మందిని నవంబర్ 19న పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, వీరి దొంగతనానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి
గోల్డీ బ్రార్‌పై కెనడా భారీ రివార్డు.. ఆచూకీ తెలిపితే రూ.1.63 కోట్లు..
అమెరికా జాతీయ సైబర్ డైరెక్టర్‌పై ట్రంప్ వేటు.. కిర్‌స్టెన్ డేవిస్‌కు తాత్కాలిక బాధ్యతలు..?