Share News

అమెరికా జాతీయ సైబర్ డైరెక్టర్‌పై ట్రంప్ వేటు.. కిర్‌స్టెన్ డేవిస్‌కు తాత్కాలిక బాధ్యతలు..?

ABN , Publish Date - Nov 20 , 2026 | 10:19 AM

అమెరికాలో వరుసగా తలెత్తుతున్న సాంకేతిక అంతరాయాలతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ జాతీయ సైబర్ డైరెక్టర్ సీన్ కైర్న్‌క్రాస్‌ను పదవి నుంచి తొలగించేందుకు ట్రంప్ మద్దతు పలికినట్లు సమాచారం.

అమెరికా జాతీయ సైబర్ డైరెక్టర్‌పై ట్రంప్ వేటు.. కిర్‌స్టెన్ డేవిస్‌కు తాత్కాలిక బాధ్యతలు..?
Sean Cairncross

వాషింగ్టన్: అమెరికాలో వరుసగా తలెత్తుతున్న సాంకేతిక అంతరాయాలతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ జాతీయ సైబర్ డైరెక్టర్ సీన్ కైర్న్‌క్రాస్‌ను పదవి నుంచి తొలగించేందుకు ఆయన మద్దతు పలికినట్లు సమాచారం. ఈ మేరకు కైర్న్‌క్రాస్‌ స్థానంలో రక్షణ శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కిర్‌స్టెన్ డేవిస్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వైట్‌హౌస్‌ వర్గాల ప్రకారం.. సైబర్ భద్రత వంటి కీలక బాధ్యతలు నిర్వహించేందుకు కైర్న్‌క్రాస్‌కు తగిన అర్హతలు లేవని ట్రంప్ భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆయనను పదవి నుంచి తొలగించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు, కైర్న్‌క్రాస్‌ స్వచ్ఛందంగానే బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంకో రెండేళ్ల పాటు పదవిలో కొనసాగడం ఆయనకు ఇష్టం లేదని ఆ వార్తా కథనాలు పేర్కొన్నాయి.


ఇటీవల అమెరికాలో పలు కీలక వ్యవస్థలు సాంకేతిక సమస్యలతో స్తంభించాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో అంతరాయంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ సేవలు, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, ప్రధాన బ్యాంకుల సేవలూ ప్రభావితమయ్యాయి. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అంతర్గత నెట్‌వర్క్‌లోనూ సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వ వ్యవస్థలు, కీలక మౌలిక సదుపాయాల సైబర్ భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

అయితే ఈ ఘటనలన్నీ ఒకే సైబర్ దాడిలో భాగం కాదని అమెరికా నిఘా అధికారులు స్పష్టం చేశారు. నిర్వహణ పనులు, సాంకేతిక మార్పుల వల్ల వేర్వేరు అంతరాయాలు ఏర్పడ్డాయని తెలిపారు. ఈ పరిణామాల మధ్య అమెరికా సైబర్ భద్రతా వ్యవస్థలో నాయకత్వ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, జాతీయ సైబర్ డైరెక్టర్ పదవి శాశ్వత నియామకానికి సెనేట్ ఆమోదం అవసరం కానుంది.


ఈ వార్తలు కూడా చదవండి

గోల్డీ బ్రార్‌పై కెనడా భారీ రివార్డు.. ఆచూకీ తెలిపితే రూ.1.63 కోట్లు..

గతంలో ఇరాక్‌పై కూడా ఇలాంటి ప్రచారమే చేశారు: ఇరాన్

Updated Date - Nov 20 , 2026 | 10:33 AM