పిల్లల్లో పెరుగుతున్న టైప్-1 డయాబెటిస్.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు!
ABN , Publish Date - Nov 16 , 2026 | 10:03 AM
దేశంలో అధిక సంఖ్యలో పిల్లలు మధుమేహం బారిన పడుతున్నారు. భారత్లో మూడు లక్షల మందికి పైగా చిన్నారులు ‘టైప్-1’ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారని తాజాగా ఓ సర్వే వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో అధిక సంఖ్యలో పిల్లలు మధుమేహం బారిన పడుతున్నారు. భారత్లో మూడు లక్షల మందికి పైగా చిన్నారులు ‘టైప్-1’ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారని తాజాగా ఓ సర్వే వెల్లడించింది. ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. ఈ నేపథ్యంలో మధుమేహ నిర్ధారణ, చికిత్స లాంటి అంశాలపై ప్రజలకు వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు. చిన్నారుల్లో ఈ రకం మధుమేహాన్ని ఎలా గుర్తించాలో వివరిస్తున్నారు. ‘టైప్-1’ డయాబెటిస్ కారణంగా బీపీ లాంటి ఇతర సమస్యలు వచ్చే అవకాశాలూ ఉన్నాయని అంటున్నారు. సరైన ఆహారపు అలవాట్లు పాటిస్తూ.. వ్యాయామం చేస్తే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచగలమని చెబుతున్నారు. చిన్నపిల్లల్లో డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరిస్తున్నారు.
ఇంతకీ ‘టైప్-1’ డయాబెటిస్ అంటే..
రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించే ప్యాంక్రియాస్ కణాలపై రోగనిరోధక శక్తి దాడి చేయడంతో ‘టైప్-1’ డయాబెటిస్ ఏర్పడుతుంది. చిన్నారుల్లో, మరీ ముఖ్యంగా ఏడేళ్ల వయసు లోపు వారిలో ఈ ప్యాంక్రియాస్ అభివృద్ధి దశలోనే ఉంటుంది. అందుకే వీరు ఎక్కువగా ఈ రకం మధుమేహానికి గురవుతున్నారని పరిశోధనలు పేర్కొంటున్నాయి. దీని బారిన పడిన వారు జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాల్సిందే.
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు..
పిల్లల్లో ఈ కింది లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే మధుమేహ పరీక్షలు చేయించాలి. లేకుంటే పిల్లలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు.
అధిక దాహం (పాలిడిప్సియా)
తరచుగా మూత్ర విసర్జన (పాలియూరియా)
ఆకలి పెరగడం (పాలీఫేజియా)
అకస్మాత్తుగా బరువు తగ్గడం
అలసట, తక్కువ శక్తి
చిరాకు, మానసిక స్థితిలో మార్పులు
వికారం, వాంతులు
‘టైప్-1’ డయాబెటిస్ నయం చేసే మందులు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీన్ని నియంత్రించడానికి ఇన్సులిన్ మాత్రమే దారి.
ఇవీ చదవండి
రోగనిరోధక శక్తిని దెబ్బతీసే 4 అలవాట్లు ఇవే.. వీటికి దూరంగా ఉండాల్సిందే!