Share News

ఎండలతో నిస్సత్తువ

ABN , Publish Date - Jun 02 , 2026 | 09:37 AM

ఎండలు మండిపోతున్నాయి. జూన్‌ వచ్చినా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

ఎండలతో నిస్సత్తువ
Summer, Health, Doctor

  • వడదెబ్బ, డీ హైడ్రేషన్‌ బారిన జనం

  • ఉష్ణోగ్రతలు తగ్గే వరకు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

  • తీసుకునే ఆహారం, పని సమయాల్లో మార్పులు చేసుకోవాలని సూచన

హైదరాబాద్‌ సిటీ: ఎండలు మండిపోతున్నాయి. జూన్‌ వచ్చినా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపుతుండడంతో జనం బయటికెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇంట్లో ఉన్నా ఎండ వేడిమి, ఉక్కపోతతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. మధ్యాహ్నం సమయంలో వేడిగాలులతో ఏ వస్తువు ముట్టుకున్నా కాలిపోతున్నది. వేసుకున్న దుస్తులు సైతం గరంగరంగా మారి శరీరం చెమటతో తడిసిపోతున్నది. ఎండల ప్రభావంతో నోరు ఎండిపోవడం, శరీరం నీరసించడం, తల తిరగడం, విరేచనాలు తదితర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.


గుండె జబ్బు బాధితుల ఇలా చేయాలి

ఎండాకాలంలో గుండెజబ్బు బాధితులు నీటి, ఉప్పు శాతం కాసింత పెంచాలి. 1.5 లీటర్ల నుంచి 2 లీటర్ల వరకు నీళ్లు తాగొచ్చు. ఎండ తీవ్రతను బట్టి మందుల డోసును మార్చుకోవాల్సి ఉంటుంది. ఉదయం 6 గంటల కంటే ముందు, రాత్రి 9 గంటల తరువాతనే నడక, ఇతర వ్యాయామాలు చేయాలి. జీర్ణం అయ్యే ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఈ కాలంలో కాళ్ల నొప్పులు, బాగా నిద్ర వస్తున్నట్లు అనిపిస్తే వైద్యులను సంప్రందించాలి.


తేలికైన ఆహారం తీసుకోవాలి

ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. బిర్యానీ, మాంసం, చికెన్‌, చేపలు, నూనె పదార్థాలు, ఆల్కహాల్‌, స్పైసీ ఫుడ్‌, పచ్చళ్లు వంటి వాటికి దూరంగా ఉండాలి. కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌, ఐస్‌క్రీమ్‌ తీసుకోకూడదు. పచ్చని ఆకు కూరలు, కూరగాయలు, పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. కీర, దోస, పుచ్చ నేరుగా గానీ వాటితో చేసిన జ్యూసులు గానీ తాగాలి. మజ్జిగ, కొబ్బరినీళ్లు, చెరుకు, నిమ్మ, బత్తాయి, నారింజ రసాలు, బార్లీ, సబ్జా గింజలు తీసుకోవాలి. ఎండకు రక్షణగా గొడుకు, టోపీలు, లూజుగా ఉండే హెల్మెట్‌ను ధరించడం మంచింది. వదులుగా ఉండే కాటన్‌ దుస్తులను వేసుకోవాలి.


city3.2.jpgపిల్లలు, వృదుల విషయంలో..

వడదెబ్బ తగిలిన పిల్లలు త్వరగా సొమ్మసిల్లిపోతారు. వళ్లు వేడిగా ఉంటే తడిగుడ్డతో తుడవాలి. మూత్ర విసర్జన సక్రమంగా ఉండకపోతే ద్రవ పదార్థాలు ఇవ్వాలి. చక్కర తక్కువగా ఉన్న పండ్ల రసాలు ఎక్కువగా ఇవ్వాలి. ఇంటిలో సాధ్యమైనంత వరకు వేడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శీతల పానియాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దు. దూర ప్రయాణాలు తెల్లవారుజాము, సాయంత్రం సమయాల్లో ఏర్పాటు చేసుకోవాలి. వృద్ధులు నీడపట్టునే ఉండాలి. ఇంటిలో స్పీడ్‌గా తిరిగే ఫ్యాన్‌ గాలికి కూడా వడదెబ్బ తగిలే ముప్పు ఉంది. శరీరం ఎక్కువ శ్రమకు గురికాకుండా చూసుకోవాలి. అకస్మాత్తుగా బీపీ పెరిగితే ఆస్పత్రిలో చేర్పించాలి.


బాధితున్ని చల్లని ప్రదేశానికి తరలించాలి. గాలి, వెలుతురు ప్రసరించే ప్రదేశాల్లో పడుకోపెట్టాలి. వేసుకున్న దుస్తులను తొలగించి, చల్లటి బట్టతో శరీరాన్ని తుడవాలి. ఉప్ప, పంచదార కలిపిన నీళ్లు, కొబ్బరి నీళ్లను గంట గంటకు తాగించాలి. కొందరికి ఫిట్స్‌ రావడం, కోమాలోకి జారుకోవడం ఇబ్బందులు ఉంటే వెంటనే అస్పత్రికి తరలించాలి.


చెమట పట్టకపోవడం హీట్‌ స్ట్రోక్‌కు సంకేతం

శరీరం పూర్తిగా వేడెక్కిపోవడం, చెమట పట్టకపోవడం, మాట్లాడలేకపోవడం, అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం వంటి లక్షణాలు హీట్‌ స్ట్రోక్‌కు సంకేతాలు కావొచ్చు. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఇది ప్రాణాపాయానికి దారితీయొచ్చు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, షుగర్‌, బీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ముప్పు ఎక్కువ. ఎండలో తిరిగే డెలివరీ సిబ్బంది, ట్రాఫిక్‌ పోలీసులు, నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, చిరువ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి.

- డాక్టర్‌ ఎం. గోవర్ధన్‌, సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌, కేర్‌ ఆస్పత్రి, నాంపల్లి

Updated Date - Jun 02 , 2026 | 09:37 AM